జేసి మ‌రీ ఓవ‌ర్ చేస్తున్నట్లున్నారు

అనంత‌పురం టిడిపి ఎంపి జేసి దివాక‌ర్ రెడ్డి మరీ ఓవ‌ర్ గా పోతున్న‌ట్లే ఉంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌లో పెట్టుకుని పోలీసుల‌తోనే జేసి ఎందుకు గొడ‌వ పెంచుకుంటున్నారో ఎవ‌రికీ అర్ధం కావ‌టం లేదు. అస‌లే నోటి దుర‌ద‌మ‌నిషి. దాంతో ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడుతుంటాను అనే ముసుగులో నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు. దాంతో చంద్ర‌బాబునాయుడే ఇబ్బంది ప‌డ్డ సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఇక‌, జిల్లాలో పార్టీ నేత‌ల‌తో ఎప్పుడూ ఏదో ఒక గొడ‌వే. దాంతో జేసి అంటే అంద‌రికి శ‌తృత్వం పెరిగిపోయింది.


ఇంత‌కీ ఇపుడీ విష‌యాల‌న్నీ ఎందుకంటే, మూడు రోజులుగా తాడిప‌త్రిలోని ప్ర‌బోధోనందాశ్ర‌మం కేంద్రంగా జ‌రుగుతున్న గొడ‌వ అంద‌రికీ తెలిసిందే క‌దా ? ఆ గొడ‌వ‌లో ప్ర‌బోధానంద‌స్వామి అలియాస్ అబ్బ‌య్య చౌద‌రి-జేసి వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ గొడ‌వ‌లో తాను చెప్పిన‌ట్లుగా పోలీసులు అబ్బ‌య్య ను అరెస్టు చేయలేద‌న్న కోపంతో జేసి పోలీసుల‌ను అమ్మ‌నాబూతులు తిట్టిన విష‌యం అంద‌రూ చూసిందే.


ఆశ్ర‌మం ముందు, పోలీసు స్టేష‌న్ ముందే ధర్నా చేసిన జేసి అంద‌రిముందు పోలీసుల‌ను చేత‌కాని వాళ్ళ‌న్నాడు. చ‌వ‌ట‌ల‌ని, ద‌ద్ద‌మ్మ‌లంటూ మండిప‌డ్డాడు. అస‌లు మీదే జాతంటూ పోలీసుల‌పై మండిప‌డ్డారు. పోలీసు స్టేష‌న్ ముందు హిజ్రాల‌తో నాట్యాల‌డించారు. చివ‌ర‌కు మీరంతా కొజ్జాలంటూ పోలీసుల‌ను బూతులు తిట్టారు. దాంతో జిల్లా ప పోలీసు అధికారుల సంఘం, పోలీసు సంక్షేమ‌సంఘం తీవ్రంగా స్పందించాయి. క‌దిరి సిఐ గోరంట్ల మాధ‌వ్ మాట్లాడుతూ ఇష్టం వ‌చ్చిన‌ట్లు తిడితే జేసి నాలుక చీరేస్తానంటూ గ‌ట్టి వార్నింగే ఇచ్చారు.


స‌రే, ఆ వివాదం అలా న‌డుస్తుండ‌గానే తాజాగా మాధ‌వ్ పై జేసి తాడిప‌త్రి పోలీస్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. ఎంపి, ఎంఎల్ఏల‌ను బెదిరించారంటూ జేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసి ఫిర్యాదుపై పోలీసులు ఎంత వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న‌ది వేరే విష‌యం. కానీ ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం ఏమిటంటే, ఆశ్ర‌మం విష‌యంలో త‌న మాట చెల్లుబాటు కాలేద‌న్న కోపాన్ని జేసి పోలీసుల మీద చూపించారు. ఒక‌ద‌శ వ‌ర‌కూ పోలీసులు కూడా జేసి తిట్ల‌పై స్పందించ‌లేదు. కానీ జేసి మ‌రీ రెచ్చిపోయిన కార‌ణంగానే సిఐ మాధ‌వ్ స్పందించారన్న‌ది వాస్త‌వం.


త‌ప్పంటు ఉంటే ఇద్ద‌రిలోను ఉంటుంది. లేక‌పోతే ఎవ‌రిదీ త‌ప్పులేద‌నే అనుకోవాలి. అంతేకానీ పోలీసుల‌ను తాను ఎంత తిట్టినా వాళ్ళు నోరెత్తేందుకు లేద‌న్న ధోర‌ణిలో ఉన్నారు జేసి. జేసి అధికార‌పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధి కాబ‌ట్టి తానేమ‌న్నా ఎవ‌రూ నోరెత్త‌కూడ‌దా ? ఎదుటి వాళ్ళ‌ను తానేమ‌న్నా అనొచ్చు కానీ త‌నను మాత్రం ఎవ‌రూ ఏమ‌న‌కూడదా ? త‌న‌ను హెచ్చ‌రించినందుకు సిఐ మీదే ఏకంగా పోలీసుస్టేష‌న్లో ఫిర్యాదు చేస్తారా ? జేసి వ‌ర‌స చూస్తుంటే సిఐ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలిపెట్టేట్లు లేరు. సిఐతో గొడ‌వ పెట్టుకుంటే మొత్తం పోలీసులంద‌రూ ఏక‌మై ఎదురుతిరిగితే అప్పుడు జేసి ఏం చేస్తారు ?


ఒక‌వైపు ఎన్నిక‌లు ముంచుకొచ్చేస్తున్నాయ్. ఇంకోవైపు జిల్లాలో జేసి సోద‌రుల వ‌ల్లే పార్టీ కంపుగా త‌యారైది. ఇప్ప‌టి వ‌ర‌కూ పార్టీ నేత‌ల మ‌ధ్య‌లోనే ఉన్న వివాదాలు ఇపుడు పోలీసుల‌తో బ‌హిరంగ ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌టంతో ఎప్పుడేమ‌వుతుందో ఎవ‌రూ ఊహించ‌లేకున్నారు. ఇప్ప‌టికే తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని అన్నీ శాఖ‌ల అధికారుల‌ను గుప్పిట్లో పెట్టుకుని జేసి సోద‌రులు ప‌నులు చేయించుకుంటున్నారు. ఆ మంట చాలా మంది ప్ర‌భుత్వ సిబ్బందిలో పెరిగిపోయింది. అంతా క‌లిపి రేప‌టి ఎన్నిక‌ల్లో జేసి సోద‌రుల‌కు పూర్తి వ్య‌తిరేకం చేస్తే వారు మాత్ర‌మే కాదు మొత్తం టిడిపినే న‌ష్ట‌పోవ‌టం ఖాయం.