చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ?  

తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న విషయాలను చూస్తుంటే అందరిలోను అవే అనుమానాలు మొదలయ్యాయి. తాము కోరిన టికెట్లు ఇస్తే పార్టీలో ఉంటామని లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని పరోక్షంగా చంద్రబాబుతోనే చెప్పేస్తున్నారు. అంటే ఒకరకంగా బ్లాక్ మెయిల్ చేయటమనే అనుకోవాలి. తాజాగా కాకినాడ ఎంపి తోట నర్సింహం వరస చూస్తుంటే ఆ విషయం స్పష్టమైపోతోంది. రాబోయే ఎన్నికల్లో తన భార్య వాణికి జగ్గంపేట టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. టికెట్ ఇవ్వకపోతే వైసిపిలోకి వెళ్ళిపోయేట్లుగా మద్దతుదారులతో మంతనాలు చేస్తున్నట్లు చంద్రబాబుకు మద్దతిచ్చే మీడియానే చెబుతోంది.

నిజానికి జగ్గంపేటలో ఫిరాయింపు ఎంఎల్ఏ జ్యోతుల నెహ్రూ ఉండగా తన భార్యకు తోట టికెట్ అడగటంలో అర్ధమేలేదు. కానీ అడగారంటేనే తోట హిడెన్ అజెండా స్పష్టమైపోతోంది. ఇటువంటి నేతలు, నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. వాళ్ళంతా కూడా టికెట్ల కోసం చంద్రబాబుపై బాగా ఒత్తిడి తెస్తున్నారు. గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్టు నియోజవకర్గం ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి వరస కూడా అలాగే ఉంది. తనకు నరసరావుపేట ఎంపిగా టికెట్ ఇవ్వకపోతే తాను పార్టీకి రాజీనామా చేస్తానన్నట్లుగా మాట్లాడుతున్నారు. పైగా మోదుగుల టిడిపికి రాజీనామా చేశారని కూడా అంటున్నారు.

మొన్నటి వరకూ జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ విషయంలో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య జరిగిన పంచాయితీ అందరికీ తెలిసిందే. విజయవాడ ఎంపి కేశినేని నాని, విజయనగరం ఎంపి అశోక్ గజపతిరాజు, గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ , ఒంగోలు ఎంపి అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డిలు కూడా చంద్రబాబుతో డిమాండ్లు పెడుతున్నారు. గుంటూరు లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న అభ్యర్ధులను మార్చాలని కోరుతున్నారు.

అలాగే, మాగుంట కూడా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని అభ్యర్ధలుగా తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేశినేని నాని కూడా అసెంబ్లీకి పోటీ చేస్తానని చంద్రబాబుకు చెప్పారట. అసెంబ్లీ టికెట్ సాధ్యం కాకపోతే తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఎంపి, ఎంఎల్ఏల టికెట్ల విషయంలో సుమారు 20 మంది నేతలు తమ డిమాండ్లను చంద్రబాబు ముందుంచారట. తమ డిమాండ్లు తీర్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని చంద్రబాబుకు నేరుగానే చెప్పేస్తున్నారట. చూడబోతే క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని ఆసరాగా తీసుకుని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లే కనబడుతోంది.