జనసేన కవాతంటే తెలుగుదేశం భయపడుతోందా ?

జనసేన అధినత పవన్ కల్యాణ్ నిర్వహించాలనుకున్న కవాతంటే తెలుగుదేశంపార్టీ భయపడుతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అదే అనుమానం మొదలైంది. తూర్పుగోదావరి జిల్లాలో సత్తా చాటే ఉద్దేశ్యంతో పవన్ ఈరోజు ధవళేశ్వరం బ్యారేజిపై భారీ ఎత్తున కవాతు చేయాలని నిర్ణయించారు. అభిమానులు, జనసేన కార్యకర్తలను పాల్గొనమని స్వయంగా పవనే పిలిపిచ్చారు. సరే, ఎలాగూ కాపు సామాజికవర్గం నేతలు కూడా ఉంటారు కదా ? పై మూడు వర్గాలు కలిపి కవాతును బ్రహ్మాండమైన సక్సెస్ చేయటం ఖాయమని అందరూ అనుకున్నారు.

 

ఇటువంటి సమయంలోనే మరికొద్ది సేపటిలో కవాతు ప్రారంభమవుతుందన్న సమయంలో పవన్ కు పోలీసుల నుండి అభ్యంతరాలు ఎదురయ్యాయి. బ్యారేజిపై రెండు వైపులా ఉన్నపిట్ట గోడలు బలహీనంగా ఉన్నాయట. అందుకనే భారీ ఎత్తున కవాతు ఎంతమాత్రం క్షేమకరం కాదంటూ పోలీసులు నోటీసులో చెప్పటం విచిత్రంగా ఉంది. అంతేకాకుండా బ్యారేజి దగ్గరే నిర్వహించాలనుకున్న బహిరంగసభ కూడా సాధ్యం కాదంటు పోలీసులు చెప్పటమే అనుమానంగా ఉంది.

 

పోలీసులు చెప్పినట్లుగా పిట్టగోడలు బలహీనంగా ఉన్నాయనే అనుకుందాం.  మరి ఆ పిట్టగోడలను ఎందుకు బలోపేతం చేయటం లేదు ? బలహీనంగా ఉన్న గోడలను తీసేసి బలమైన గోడలను ఎందుకు కట్టటం లేదు ? ధవళేశ్వరం బ్యారేజిపై కవాతు చేయబోతున్నాం కాబట్టి పర్మిషన్ ఇవ్వమని జనసేన చాలా రోజుల క్రితమే అడిగింది కదా ? అప్పుడే ఆ విషయం ఎందుకు చెప్పలేదు ? అప్పుడు పర్మిషన్లు ఇచ్చి తీరా అందరూ అక్కడికి చేరుకునే సమయంలో చివరి నిముషంలో అభ్యంతరాలు చెప్పటమేంటి ? సరే చివరి నిముషంలో అభ్యంతరాలు చెబితే ఎవరైనా ఒప్పుకుంటారా ? ఇదంతా చూస్తుంటే జనసేన కవాతంటే టిడిపి భయపడుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.