వైసిపిలో సంచలనం : ఆదిశేషగిరి రావు గుడ్ బై ?

వైసిపిలో కీలక నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ? నిజంగా అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, పార్టీ పెట్టినప్పటి నుండి ఆదిశేషగిరిరావు వైసిపిలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటిలో సభ్యునిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు కూడా శేషగిరిరావు బాగా సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ వ్యతిరేక మీడియ ప్రకారం వచ్చే ఎన్నికల్లో శేషగిరిరావు గుంటూరు పార్లమెంటు స్ధానం నుండి పోటీ చేయాలని అనుకున్నారట. కానీ జగన్ మాత్రం ఆయన్ను విజయవాడ లోక్ సభ స్ధానంలో పోటీ చేయించాలని నిర్ణయించారుట. దాంతో చాలా కాలంగా శేషగిరిరావు ఎక్కడి నుండి పోటీ చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.

 

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా ? ఇప్పుడు కూడా ఏదో ఒకటి తేల్చుకోలేకపోతే అసలుకే మోసం వస్తుందని అర్ధమైంది. అందుకనే గుంటూరు సీటు కోసం శేషగిరి పట్టుబట్టినట్లు జగన్ కు వ్యతిరేకంగా ఉండే మీడియా వెల్లడించింది. దాంతో జగన్ నో చెప్పారట. అందుకే మనస్తాపానికి గురై పార్టీలో ఉండటానికి ఇష్టపడక బయటకు వచ్చేయాలని శేషగిరి నిర్ణయించుకున్నట్లు వ్యతిరేక మీడియా చెబుతోంది. ప్రస్తుతం గుంటూరు లోక్ సభలో కృష్ణ సోదరుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టిడిపి ఎంపిగా ఉన్న విషయం తెలిసిందే. జగన్ వ్యతిరేక మీడియా చెప్పేదాని ప్రకారం శేషగిరి రావు టిడిపి ఎంపికి వ్యతిరేకంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

 

అయితే, వైసిపి వర్గాల సమాచారం ప్రకారం రానున్న ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేయటం శేషగిరిరావుకే ఇష్టం లేదు. నిజానికి శేషగిరిరావును విజయవాడ ఎంపిగా పోటీ చేయమని జగన్ అడిగింది వాస్తవమే. కానీ వయస్సు రీత్యా తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పారట. శేషగిరిరావు ప్రస్తుతం సుమారు 75 ఏళ్ళకు దగ్గరలో ఉన్నారు. కాబట్టి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేంత ఓపికి తనకు లేదని చెప్పేశారు. అందులోను గుంటూరు లోక్ సభ నుండి వైసిపి తరపున పోటీ చేయటానికి జగన్ మరో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి రోశయ్యకు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ వర్గాల సమాచారం ఇలా వుండగా జగన్ వ్యతిరేక మీడియా మాత్రం వైసిపికి వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టటం ఆశ్చర్యంగా ఉంది.