మంత్రి రోజాకి నగిరి సీటు ఖాయమయ్యేనా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల విషయంలో అస్సలేమాత్రం రాజీ పడటంలేదు. సర్వేల ఆధారంగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను మార్చుతూ వెళుతోంది వైసీపీ అధినాయకత్వం. ఎమ్మెల్యేలు, లోక్ సభకి వెళుతున్నారు.. ఎంపీలేమో, అసెంబ్లీకి వెళ్ళనున్నారు. కొందరికి టిక్కెట్లు నిరాకరించాల్సి వస్తోంది.

ఇంతకీ, నగిరి ఎమ్మెల్యే, సినీ నటి, మంత్రి రోజా పరిస్థితేంటి.? వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు వుంటుందా.? వుండదా.? ఫర్ ఏ ఛేంజ్ ఆమెను లోక్ సభకి పంపిస్తారా.? ఎమ్మెల్సీ సీటుతో సరిపెడతారా.? రాజ్యసభ ఛాన్స్ ఏమైనా ఇస్తారా.? ఇలా బోల్డన్ని ప్రశ్నలు.

టిక్కెట్టు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఫరక్ పడదు.. వైసీపీతోనే నా రాజకీయ ప్రయాణం.. నేను జగనన్న వెంటే వుంటాను.. అని చెబుతున్నారు మంత్రి రోజా. అదే సమయంలో, నగిరి టిక్కెట్ మళ్ళీ తనకే దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారామె.

నియోజకవర్గంలో సొంత పార్టీకి చెందిన మహిళా నేత ఒకరు తన మీద చేసిన ‘50 లక్షలు నొక్కేశారన్న’ ఆరోపణపై రోజా తాజాగా స్పందించారు. అవన్నీ ఫేక్ ఆరోపణలని కొట్టి పారేశారు. గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారమనీ రోజా మండిపడ్డారు.

ఇదిలా వుంటే, రోజాకి ఇంకోసారి నగిరి టిక్కెట్టు ఇచ్చే విషయమై వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమంత సుముఖంగా లేరట. నియోజకవర్గంలో రోజా పట్ల క్యాడర్‌లో వున్న వ్యతిరేకతే అందుకు కారణమని అంటున్నారు. సర్వేల నివేదికల్లోనూ రోజాకి వ్యతిరేకంగానే లెక్కలు కనిపిస్తున్నాయట.

అయితే, రోజాని కాదనుకుంటే, ఆ తర్వాత ఆమె రాజకీయంగా చేసే విమర్శల్ని తట్టుకోవడం కష్టమన్న అభిప్రాయం వైసీపీలో అంతర్గతంగా వ్యక్తమవుతోంది. ఈ ఒక్కటే, ఆమెకు సీటు మళ్ళీ దక్కడానికి కారణం కావొచ్చట.