ఏపిలో హంగ్ తప్పదా ?  సీఎం పీఠంపైనే పవన్ గురి

చూడబోతే జనసేన అధినేత  పవన్ కల్యాణ్ ఆశలన్నీ అలాగే కనిపిస్తున్నాయి. ఏ బహిరంగసభలో మాట్లాడినా చంద్రబాబునాయుడు మళ్ళీ అధికారంలోకి రాడని పవన్ స్పష్టంగా చెబుతున్నారు. అంత వరకూ ఓకే అనుకోవచ్చు. అదే సమయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం దక్కదే కల్లే అని కూడా జోస్యం చెబుతున్నారు. అది కూడా నిజమే అనుకుందాం. అటు చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రాక, జగన్ కూ అధికారం దక్కకపోతే మరి అధికారంలోకి ఎవరొస్తారు ? వచ్చే ఎన్నికల్లో జనసేనే అధికారంలోకి వస్తోందని, తానే ముఖ్యమంత్రవబోతున్నట్లు పవన్ మైకుగుద్ది మరీ చెబుతున్నారు.

 

నిజానికి జనసేన అధికారంలోకి వచ్చే విషయంలో ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే, ఆ పార్టీ పరిస్ధితి అలాగుంది మరి. క్షేత్రస్ధాయిలో పార్టీ నిర్మాణం లేదు. రాష్ట్రస్ధాయిలో అధ్యక్షుడిగా పవన్ తప్ప చెప్పుకోవటానికి మరో గట్టి నేతే లేరు. పార్టీలో కీలక నేతలెవరున్నారంటే ఒకటి నుండి 10 వరకూ లెక్కేస్తే అన్నీ స్ధానాల్లోను పవన్ తప్ప మరోకరు కనబడరు.  ధనబలమున్న వాళ్ళు తప్ప జనబలమున్న నేతలు కాగడా వేసి వెదికినా కనబడటం లేదు. ధనబలమున్న వాళ్ళు కూడా కొద్దిమందే ఉన్నారు. వాళ్ళ వల్ల రేపటి ఎన్నికల్లో పార్టీ పెద్దగా లాభపడేదేమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి అభ్యర్ధుల పేర్లు చెప్పమంటే కళ్ళు తేలేయాల్సిందే. అభిమానుల బలం తప్ప నేతల బలం ఎక్కడా కనబడటం లేదు. ఇటువంటి పరిస్దితుల్లో జనసేన అధికారంలోకి వచ్చేస్తుందని పవన్ ఎలా చెబుతున్నారు ? ఎలాగంటే, కర్నాటక ఫార్ములానే నమ్ముకున్నారట. తెలుగుదేశంపార్టీ, వైసిపిలు చెరిసగం కొన్ని సీట్లను పంచుకుంటాయట. అంటే స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు, జగన్ లో ఎవరికీ సరిపడా బలం ఉండదని పవన్ అంచనా వేస్తున్నారట. ఓ 30 సీట్లు గనుక జనసేన తెచ్చుకుంటే సరిపోతుందని పవన్ అనుకుంటున్నట్లు సమాచారం.

 

సరిగ్గా అప్పుడే కర్నాటక ఫార్ములా తెరపైకి వస్తుందట. పై ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు కచ్చితంగా జనసేనకు మద్దతు పలకుతారన్నది పవన్ ఆలోచనట. అంటే 39 సీట్లు తెచ్చుకున్న కుమారస్వామి కర్నాటకలో సిఎం అయినట్లే ఏపిలో కూడా తాను సిఎం అయ్యే అవకాశాలున్నాయన్నది పవన్ ఆశగా చెబుతున్నారు. ఆ ఆశతోనే వచ్చే ఎన్నికల్లో తానే సిఎం అవుతున్నట్లు పవన్ పదే పదే చెబుతున్నారని జనసేన వర్గాలు చెప్పాయి. మరి పవన్ ఆశ ఎంత వరకూ నెరవేరుతుందో చూడాల్సిందే.