జనసేన అధినేత పవన్ కల్యాణ్ పగటి కలలు కంటున్నట్లున్నారు. ముఖ్యమంత్రవ్వగానే తాను ముఖేష్ అంబానీని పిలిచి మాట్లాడుతారట. అప్పటికేదో ఎన్నికలు జరిగినట్లు తాను సిఎం అయిపోయినట్లు కలలు కంటున్నట్లు అనిపిస్తోంది. ఇంతకీ ముఖేష్ ను ఎందుకు పిలిపిస్తాడంటే చమురు సంస్ధల అన్వేషణలో కోనసీమలో పర్యావరణం దెబ్బతింటోందట. ఎలాగుంది పవన్ మాటలు. ఈరోజు అమలాపురంలో జరిగిన రైతులతో ముఖాముఖి సమావేశంలో పవన్ మాట్లాడుతూ, చమురు సంస్ధలతో పాటు ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు.
కోనసీమను నాశనం చేస్తు సహజ వనరులను దోచుకోవటం ద్వారా ఈ ప్రాంతానికి అన్నీ విధాల అన్యాయం చేస్తున్నారంటు ఆరోపించటం విచిత్రంగా ఉంది. కోనసీమలో సహజ వాయువల అన్వేషణ ఈనాటిది కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతోంది. అదేమిటో ఆ విషయం పవన్ కు ఇపుడే గుర్తొచ్చింది. పైగా మిగిలిన పార్టీల్లా పార్టీఫండ్ ఇస్తే లొంగిపోయే పార్టీ జనసేన కాదని చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. నాలుగేళ్ళ పాటు చంద్రబాబు చేసిన ప్రతీ చర్యను పవన్ ఆమోదించారు. మరి ఎక్కడ చెడిందో లేక చెడినట్లు నాటకాలాడుతున్నారో తెలీటం లేదుకానీ పవన్ ఇఫుడు కొత్త నాటకానికి తెరలేపటం మాత్రం ఆశ్చర్యంగానే ఉంది.
చమురు సంస్ధల అన్వేషణ అన్నది రాష్ట్రప్రభుత్వ పరిధిలో లేదన్న విషయం పవన్ కు తెలుసో తెలీదో ? చమురు అన్వేషణ పూర్తిగా కేంద్రప్రభుత్వ ఆధీనంలోనిది. పైగా చమురు అన్వేషణలో ఒక్క ముఖేష్ మాత్రమే కాదు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమీషన్ (ఓఎన్జిసి) కూడా అన్వేషిస్తోంది. అభివృద్ధి అంటేనే కొంత విధ్వసం కూడా ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలో చమురు నిల్వలున్నాయి కాబట్టే, పెద్ద పెద్ద గ్యాస్ సంస్ధలు వచ్చాయి కాబట్టే కోనసీమలో ఉద్యోగ, ఉపాధి కూడా సాధ్యమైంది. అయితే, జరగాల్సినంత అభివృద్ధి జరగకపోయుండుచ్చు. అంతమాత్రాన కోనసీమలో విధ్వసం జరుగుతోందనటం తప్పు.
పైగా రైతుల కన్నీళ్ళు చూడలేకే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. వైఎస్సార్ హయాంలో ఎసఈజడ్ పేరుతో పొలాలు దోచుకుని రైతులను రోడ్లమీద పడేశారట. చంద్రబాబు హయాంలో రైతులపై కాల్పులు జరపటం కలచివేసిందట. మరి అదే చంద్రబాబుకు పోయిన ఎన్నికల్లో ఎలా మద్దతిచ్చారంటే మాత్రం సమాధానం చెప్పరు. ఊళ్ళ కోసం రోడ్లు వేయటం చూశానే కానీ రోడ్ల కోసం ఊళ్ళను తీసేయటం ఇఫుడే చూస్తున్నట్లు చెప్పటం విడ్డూరమే. ఎందుకంటే, చంద్రబాబు చంకలో పవన్ కూర్చుని ఉన్నపుడే ఆ పని మొదలైంది. అయినా అప్పట్లో పవన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పి అడ్రస్ లేకుండా ఎందుకు మాయమైపోయారు ?
.