వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారకరామారావు.. ఇద్దరూ గొప్ప నాయకులు.. అని యంగ్ టైగర్ ఎన్టీయార్ పేర్కొనడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆ ఇద్దరూ తెలుగు నేలకు సంబంధించి రాజకీయంగా బోల్డంత పేరు ప్రఖ్యాుతులు సంపాదించినవారు. అందులో నందమూరి తారకరామారావు సినీ నటుడిగా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద రాజకీయ ఆరోపణలు వున్నట్లే, నందమూరి తారకరామారావు మీద కూడా వున్నాయ్. రాజకీయాల్లో ఎవరూ ఆరోపణలకు అతీతం కాదు. యంగ్ టైగర్ ఎన్టీయార్, తన తాత స్వర్గీయ ఎన్టీయార్ పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించడంపై ట్వీటేశారు. అది బాధాకరమనీ అన్నారు. పేరు తొలగించడం ద్వారా ఎన్టీయార్ స్థాయిని ఎవరూ తగ్గించలేరని కూడా చెప్పాడు.
అంతే, టీడీపీ నేతలకు ఒళ్ళు మండిపోయింది. ఎన్టీయార్‌తో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పోలికేంటి.? అంటూ టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి వుంటాయి. ఎన్టీయార్ ఓ సినీ నటుడు. ఆయన ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా లేడు. తెలుగుదేశం పార్టీకి చెందిన సభ్యత్వం ఆయనేమీ తీసుకోలేదు. అలాంటప్పుడు ఎన్టీయార్‌ని టీడీపీ నేతలెలా విమర్శిస్తారు.?
టీడీపీ నేతల కంటే ఎక్కువగా టీడీపీ అనుకూల మీడియా గింజుకుంటోంది. ఎన్టీయార్ ఏదో ఘోర తప్పిదం తన తాతని వైఎస్సార్‌తో పోల్చడం ద్వారా చేసినట్లు టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా రంకెలేస్తుండడం ఆశ్చర్యకరం. సినీ నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని ఫాలోయింగ్ వున్న ఓ నటుడు, తన బాధ్యతలెరిగి.. అత్యంత జాగ్రత్తగా సున్నితమైన అంశంపై స్పందించాడనుకోవాలంతే ఎవరైనా.