అసెంబ్లీలో జరుగుతున్న చర్చలు చూస్తుంటే చంద్రబాబునాయుడు విషయంలో అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. చంద్రబాబు సిఎంగా ఉన్న ఐదేళ్ళు అసెంబ్లీ నిర్వహణను తన ఇష్టప్రకారమే జరిగాయి. సభా నాయకుడి హోదాలో సభలో వ్యవహారాలన్నీ చంద్రబాబు అనుకున్నట్లే జరిపించుకున్నారు. ఇపుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా సభ తాను అనుకున్నట్లే జరగాలని మాట్లాడటంతోనే సమస్య వస్తోంది.
అంశం ఏదైనా కానీయండి ముందుగా అధికారపార్టీ తరపున సిఎం కావచ్చు, మంత్రులు, చీఫ్ విప్, విప్పులు, ఎంఎల్ఏల్లో ఎవరైనా మాట్లాడుతారు. అలాగే ప్రతిపక్షానికి అవకాశం వచ్చినపుడు ప్రధాన ప్రతిపక్ష నేత కానీ లేకపోతే ఇంకెవరైనా మాట్లాడుతారన్న విషయం అందిరికీ తెలిసిందే. అంతిమంగా సభా నాయకుడు హోదాలో ముఖ్యమంత్రి ఓ ప్రకటన చేసిన తర్వాత ఆ అంశంపై చర్చను స్పీకర్ ముగించేస్తారు.
ఇపుడు జగన్మోహన్ రెడ్డి సభానాయకుడు కాబట్టి జరగాల్సింది కూడా ఇదే. కానీ ఇక్కడే చంద్రబాబు మాటలు విచిత్రంగా ఉంది. సున్నావడ్డీకి రైతులకిచ్చిన రుణాలపై పెద్ద గొడవే జరిగింది. ముందుగా అధికారపార్టీ తరపున జగన్ మాట్లాడారు. ప్రతిపక్షం తరపున చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామానాయుడు మాట్లాడారు.
ప్రతిపక్షం తరపున ముగ్గురు మాట్లాడేశారు కాబట్టి ఫైనల్ గా జగన్ మాట్లాడిన తర్వాత అంశాన్ని ముగించేస్తానని స్పీకర్ అనగానే చంద్రబాబు అభ్యంతరం పెట్టారు. జగన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ తాను మాట్లాడుతానని చెప్పటంతో స్పీకర్ కూడా విస్తుపోయారు. వెంటనే జగన్ కల్పించుకుని చంద్రబాబు తానింకా ముఖ్యమంత్రిని అనే భ్రమల్లో ఉన్నారని చురకలంటించటంతో చంద్రబాబు మళ్ళీ నోరెత్తలేదు.