అసెంబ్లీలో జరుగుతున్న యవ్వారాలు చూస్తుంటే అలాగే అనుమానించాల్సొస్తోంది. రెచ్చగొట్టటం ఉచ్చులోకి లాగటం తర్వాత బురదచల్లి గబ్బు పట్టించటం టిడిపికి బాగా అలవాటైన విద్య. మరి ఇపుడు సభలో కూడా అదే విద్యను ప్రయోగిస్తున్నట్లే అనిపిస్తోంది. కాకపోతే కొన్నిసార్లు సక్సెస్ అయినట్లు అనిపిస్తున్నా మొత్తం మీద ఫ్లాప్ అవుతోందనే అనుకోవాలి.
బడ్జెట్ సమావేశాలు మొదలైన దగ్గర నుండి చంద్రబాబునాయుడు అండ్ కో ది అదే పద్దతి. కొన్నిసార్లు టిడిపి ఎంఎల్ఏల ఉచ్చులో జగన్మోహన్ రెడ్డి పడినట్లే కనిపిచింది. అందుకే టిడిపి ఎంఎల్ఏలపై జగన్ ఓ రేంజిలో రెచ్చిపోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు చివరకు విద్యుత్ పిపిఏల అంశం కూడా కావచ్చు.
తన హయాంలో జరిగిన అవినీతిని జగన్ బయటపెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టగానే ఏదో ఓ కారణంతో జగన్ ను రెచ్చగొట్టేందుకు అసెంబ్లీలో టిడిపి సభ్యులు వంతులవారీగా ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. దాంతో జగన్ కు ఇరిటేషన్ వచ్చేస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో మొత్తం ప్రశ్నలు చర్చకు రానీయకుండా ఏ ఒకటో రెండో ప్రశ్నల దగ్గరే అధికార పార్టీని నిలిపేయాలన్న టిడిపి ఆలోచనను జగన్ పసిగట్టారు.
అదే సమయంలో తమకు ఇబ్బందులు మొదలవుతాయని అనుకోగానే ఏదో ఓ చిన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని అసెంబ్లీలో గలాబా మొదలుపెడుతున్నారు. దాంతో కనీసం గంటన్నర పాటు విలువైన సమయం వృధాగా పోతోంది. చివరకు తమ సీట్లలో నుండే అరవటం, లేకపోతే స్పీకర్ ఛైర్ దగ్గరకు వెళ్ళి గోలచేసి సస్పెండ్ చేయించుకోవటం అంతా ప్లాన్ ప్రకారమే నడుపుతోంది టిడిపి. కాబట్టి అసెంబ్లీలో ఎంత తొందరగా రెచ్చిపోతే ప్రభుత్వానికి అంత నష్టమని జగన్ గ్రహించాలి.