ఈమధ్య చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడినా తెలంగాణా ప్రస్తావన లేకుండా మాట్లాడం లేదు. ఎన్నికల సమయంలో ఎక్కడ మాట్లాడినా కెసియార్ పై నోరుపారేసుకున్నారు. పైగా ప్రతీ రోడ్డుషోలోను కెసియార్, జగన్, మోడి ఒకటే అనే పనికిమాలిన పోలిక పెట్టారు. ఇపుడు ఎలక్షన్ కోడ్ ప్రస్తావన వచ్చినపుడల్లా తెలంగాణాలో కెసియార్ రివ్యూలు పెట్టటం లేదా ? అంటూ తెలంగాణాను లాగుతున్నారు.
మరి 40 ఇండస్ట్రీకి ఇంత చిన్న విషయం ఎందుకు అర్ధం కావటం లేదో తెలియటం లేదు. బ్రీఫింగ్ ఇచ్చే వాళ్ళెవరో సరిగా బ్రీఫటం లేదని మాత్రం అర్ధమవుతోంది. ఎన్నికలకు సంబంధించి ఏపికి తెలంగాణాకు పోలికి లేనే లేదు. ఎందుకంటే, ఏపిలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలకు కూడా పోలింగ్ జరిగింది. అదే తెలంగాణాలో కేవలం పార్లమెంటుకు మాత్రమే పోలింగ్ జరిగింది.
తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు జరగటం అందులో కెసియార్ రెండోసారి సిఎం అవ్వటం అన్నీ అయిపోయాయి. తెలంగాణాలో కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా ఆది కేవలం నామమాత్రమే. కెసియార్ రివ్యూలకు చీఫ్ సెక్రటరి, డిజిపిలు హాజరవుతున్నారంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి కాబట్టే ఇక్కడ కోడ్ కెసియార్ కు వర్తించదు.
తెలంగాణాలో తీసుకుని విధానపరమైన నిర్ణయాలకు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ కెసియారే బాధ్యుడు. కాబట్టి లాభనష్టాలు కెసియారే భరిస్తారు.. కానీ ఏపిలో అలాకాదు. మే 23న జరిగే కౌంటింగ్ లో చంద్రబాబు అధికారంలోకి వస్తారో లేదో తెలీదు. ఇపుడు చంద్రబాబు రివ్యూలు చేసి తనిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే రేపు టిడిపి ప్రభుత్వం కాకుండా మరేదైనా ప్రభుత్వం వస్తే పరిస్ధితేంటి ?
గతంలో అంటే సమైక్య రాష్ట్రంలో 2003లో కేర్ టేకర్ గా ఉన్న సమయంలో అనేక కంపెనీలకు వందల ఎకరాల భూమిని పందేరం చేసిన ఘనచరిత్రుంది చంద్రబాబుకు. అందుకే చంద్రబాబును రివ్యూలు చేయొద్దని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇంతచిన్న విషయం కూడా చంద్రబాబుకు తెలీదా ?