చూడబోతే వ్యవహారం అలాగే అనిపిస్తోంది. ప్రభుత్వం తరపున ఏ విధానపరమైన అంశంపై మాట్లాడాలన్నా, ప్రతిపక్షాల ఆరోపణలకు సమాధానం ఇవ్వాలన్నా ఇపుడు అందరికీ కనబడుతున్నది కుటుంబరావే. కుటుంబరావంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడన్నమాట. ఆయన చేయాల్సిన పనేంటంటే ఆర్ధికపరమైన అంశాలపై రాష్ట్రప్రభుత్వానికి సలహాలివ్వాలంతే. కానీ ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షాలపై మంత్రుల్లాగ, తెలుగుదేశంపార్టీ నేతల్లాగ ప్రత్యారోపణలతో ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రతిపక్ష నేతలకు సవాళ్ళు విసురుతున్నారు.
విషయం ఏదైనా కానీండి ఇపుడు అన్నింటిలోను కుటుంబరావే ముందుంటున్నారు. ఎందుకన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు. పోలవరం, పట్టిసీమ, రాజధాని నిర్మాణం..ఇలా అంశం ఏదైనా కావచ్చు. తాజాగా వివాదాస్పదమైన అమరావతి రాజధాని నిర్మాణానికి బాండ్ల జారీ వ్యవహారం కూడా కావచ్చు. బాండ్ల జారీలో అవినీతి జరిగిందని ఎవరైనా నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ కుటుంబరావు ఇటు వైసిపి, అటు బిజెపి నేతలకు సవాల్ విసరటమే చర్చనీయాంశమైంది. అవినీతి జరిగిందని నిరూపితమైతే రాజీనామా చేయాల్సింది కుటుంబరావు కాదు చంద్రబాబునాయుడే. అలాంటిది తాను రాజీనామా చేస్తానని అంటున్నారంటే అప్పటికి తానేదో చంద్రబాబు సమానస్ధాయి వ్యక్తిననే భ్రమలో ఉన్నట్లున్నారు కుటుంబరావు.
అయినా అవినీతి నిరూపితమైతే నిజంగా రాజీనామాలు చేసేంత నిఖార్సైన నేతలున్నారా ? పట్టిసీమ, పోలవరం, తాత్కాలిక సచివాలయంలో భారీ అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్ధారించింది. రాజకీయాలన్నాక అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణలు మామూలే. కానీ ఇంతకాలం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలనే కాగ్ నిర్ధారించింది. మరి, నిప్పు నిప్పు అంటూ తన భుజం తానే చరుచుకుంటున్న చంద్రబాబు రాజీనామా చేస్తారా ? ఛాన్సే లేదు. అటువంటిది ప్రతీదానికి కుటుంబరావు రాజీనామాల గురించి మాట్లాడటమేంటో అర్ధం కావటం లేదు. విధానపరమైన అంశాలపై మాట్లాడాల్సిన మంత్రులు ఎందుకు నోరెత్తటం లేదు ? లేకపోతే చంద్రబాబే మంత్రులెవరినీ నోరెత్తద్దని ఆదేశించారా ?