జాతీయ రాజకీయల్లోకి చంద్రబాబు ? కలెక్టర్ల సమావేశంలో సంకేతాలు

తాజాగా చంద్రబాబునాయుడు మాటలు వింటుంటే అదే అనుమానం వస్తోంది. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, తాను జాతీయ స్ధాయిలో పనిచేయాల్సిన అవసరం వస్తోందంటూ చెప్పారు. దాంతో చంద్రబాబు మాటలు విన్న వారు ఆశ్చర్యపోయారు. మొన్నటి వరకూ తనకు జాతీయ రాజకీయాల్లో ఆసక్తి లేదని రాష్ట్రాభివృద్ధే తన మొదటి ప్రయారిటీ అంటూ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇంతలో ఏమైందో ఏమో జాతీయ స్ధాయిలో పనిచేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు.

 

సుమారు రెండు దశాబ్దాల క్రితం నుండే చంద్రబాబు ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయతే, ప్రధానమంత్రిని ఎంపిక చేశానని, రాష్ట్రపతిని తానే ఎంపిక చేశానని చెప్పుకుని తిరుగుతుంటారు. అప్పుడెప్పుడు కూడా జాతీయ స్ధాయిలో తన అవసరం ఉందని ఎప్పుడూ చెప్పలేదు. అలాంటిది ఇపుడు చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి ? ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ లేదు. జాతీయ మీడియా చేసిన సర్వేలు, జనాభిప్రాయం దాదాపు వైసిసి వైపే ఉంది. పాదయాత్ర సందర్భంగా జనాలు జగన్ పై చూపుతున్న స్పందనే అందుకు నిదర్శనంగా ప్రచారం అవుతోంది.

 

నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై విపరీతమైన అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. ఒకవైపేమో కేంద్రప్రభుత్వంతో సఖ్యత లేదు. చంద్రబాబును నరేంద్రమోడి దగ్గరకు రానీయలేదు. చంద్రబాబు అడిగినవి ఏవీ మోడి చేయలేదు. అందుకే ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేశారు. కానీ దానికి రాష్ట్రప్రయోజనాలనే కలరింగ్ ఇచ్చారనుకోండి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇబ్బందులు తప్పవు. అందుకనే హఠాత్తుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు.

 

అంటే మోడి, జగన్ ల వల్ల తనకు ఏమైనా ఇబ్బందులు మొదలైతే జాతీయ స్ధాయిలో ఏదో ఓ కూటమి మద్దతు తీసుకోవటానికి వీలుగా కాంగ్రెస్ తో కలిశారన్నది స్పష్టం. అందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే తన మకాంను ఢిల్లీకి మార్చేసినా మార్చగలరు చంద్రబాబు. అందుకనే కలెక్టర్ల సదస్సులో జాతీయస్ధాయిలో తన అవసరం గురించి సంకేతాలు పంపారేమో ?