తలసానంటే కూడా భయమేనా ?

అదే విచిత్రంగా ఉంది చంద్రబాబునాయుడు పరిస్ధితి వింటుంటే. గుంటూరులో ఈనెల 3వ తేదీన నిర్వహించాలని అనుకుంటున్న యాదవుల బహిరంగసభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా సతాయిస్తోంది. బిసిల్లోని బలమైన ఉపకులమైన యాదవులు సభ పెట్టుకుంటామంటే ప్రభుత్వం ఎందుకు అనుమతులు ఇవ్వటం లేదు ? ఎందుకంటే, సభ నిర్వహణంతా తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో జరుగుతుందట.

తలసాని అంటే తెలుసు కదా ? తెలంగాణాలో మంత్రి. ఈయన తెలంగాణాలో టిడిపి తరపున 2014లో పోటీ చేసి తర్వాత టిఆర్ఎస్ లోకి ఫిరాయించి మంత్రయ్యారు. అప్పటి నుండి చంద్రబాబునాయుడంటే మండిపోతున్నారు. అంటే కెసియార్ కు చంద్రబాబంటే మంటకాబట్టి మంత్రులు కూడా అందుకే రెచ్చిపోతున్నారు. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత చంద్రబాబు తలబొప్పి కట్టిన విషయం తెలిసిందే.

తెలంగాణా ఎన్నికల్లో కెసియార్ ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన చంద్రబాబు బోర్లా పడ్డారు.  అందుకే ఏపి ఎన్నికల్లో చంద్రబాబుకు కెసియార్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. బహుశా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటంలో భాగంగానే తలసానిని కెసియర్ ప్రయోగించినట్లున్నారు. ఈమధ్య ఏపిలో పర్యటించిన తెలంగాణా మంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగానే బాహాటంగానే వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. తర్వాత తలసానితో టచ్ లోకి వెళ్ళిన తమ్ముళ్ళకి చంద్రబాబు క్లాసులు తీసుకున్నారనుకోండి అది వేరే సంగతి.

చంద్రబాబు ఓటమే ధ్యేయంగా తాను పనిచేస్తానని తలసాని బహిరంగంగానే సవాలు విసిరారు. రాష్ట్రంలో ఉన్న యాదవులందరినీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి తెస్తానని ఇప్పటికే తలసాని ప్రకటించారు. రేపటి బహిరంగ సభకు అనుమతిస్తే ఇబ్బందొస్తుందని చంద్రబాబు భయపడుతున్నారేమో. అందుకనే గుంటూరు సభకు అనుమతివ్వటంలో ప్రభుత్వం అడ్డుపడుతోంది.