పవన్ కు నాదెండ్ల షాక్  ?

నాదెండ్ల మనోహర్ కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ ఇవ్వనున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎందుకంటే, మనోహర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బిజెపిలో చేరనున్నారు. శనివారం హైదరాబాద్ కు బిజెపి జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారు.  ఈ సందర్భంగా భాస్కరరావు కమలం కండువా కప్పుకోనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

భాస్కర్ రావు బిజెపిలో చేరిన తర్వాత కొడుకు మనోహర్ జనసేనలో ఉండి ఏం చేస్తారు ? పైగా జనసేనలో ఉన్నందు వల్ల  మనోహర్ కు వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదన్నది వాస్తవం. కాంగ్రెస్ లో రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిచినా అదంతా పార్టీ చలవనే చెప్పాలి. విభజన నేపధ్యంలో తెనాలిలో పోటీ చేసినా డిపాజిట్ రాలేదు. చివరకు వేరే దారిలేక మొన్నటి ఎన్నికల ముందు జనసేనలో చేరారు.

పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించినా మనోహర్ మాత్రం ఓడిపోక తప్పలేదు. పార్టీ చీఫ్ పవన్ కల్యాణే రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత మనోహర్ లాంటి నేతలు మాత్రం ఎలా గెలుస్తారు ? అందుకనే ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు.

ప్రస్తుతం పవన్ తో కలిసి మనోహర్ అమెరికాలోని  తానా సభలకు వెళ్ళినా తిరిగి వచ్చిన తర్వాత ఏదో రోజు బిజెపిలో చేరటం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే పవన్ కు పెద్ద షాక్ తప్పదనే చెప్పాలి. ఇప్పటికే చాలామంది కీలక నేతలు జననసేనకు గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే.