కర్నూలు జిల్లాలో అఖిల కొత్త చిచ్చు

క్షేత్రస్దాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.  ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ తొందరలో తెలుగుదేశంపార్టీకి గుడ్ బై చెప్పనున్నారట. జిల్లాలో ఫిరాయింపు మంత్రి వ్యతిరేకులంతా ఏకమవ్వటం చూస్తుంటే అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూతా ఊతమిస్తున్నాయి.  కార్డన్ సెర్చ్ పేరుతో వారం రోజుల క్రితం పోలీసులు అర్ధరాత్రి టిడిపి నేతల ఇళ్ళపై దాడులు చేశారు. అదికూడా ఎవరో చెప్పి చేయించినట్లుగా అఖిలప్రియ మద్దతుదారుల ఇళ్ళలోనే సోదాలు జరపటం, ఒకరిపై పిడి యాక్ట్ కేసు పెట్టటం చూస్తుంటే తనను బయటకు పంపటానికి ప్లాన్ జరుగుతోందని అఖిల కూడా అనుమానిస్తున్నారు. దాంతో తొందరలోనే అఖిల టిడిపికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జిల్లాలో ఊపందుకుంది.

రానున్న ఎన్నికల్లో నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో భూమా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిలకు టిక్కెట్లు దక్కవనే ప్రచారం బాగా జరుగుతోంది. దానికి ప్రధాన కారణం సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డి, ఫిరాయింపు ఎంపి ఎస్పీవై రెడ్డే అని అఖిల అనుమానం. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో పోటీ చేయబోయేది తాను అంటూ ఏవి బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఫిరాయింపు మంత్రికి పోటీగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాంతో అఖిలకు తలనొప్పులు మొదలయ్యాయి. ఏవిని అడ్డుకోలేక, పార్టీ నేతలకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేక అఖిల బాగా ఇబ్బందులు పడుతోంది. అఖిల ఉద్దేశ్యంలో చంద్రబాబునాయుడుకు తెలిసే ఏసి సుబ్బారెడ్డి రెచ్చిపోతున్నారట.

ఇక నంద్యాల విషయానికి వస్తే రాబోయే ఎన్నికల్లో తమకే టిక్కెట్టు అంటూ ఎస్పీవై రెడ్డి బాహాటంగానే చెప్పేస్తున్నారు. ఎంపి వైఖరి సిట్టింగ్ ఎంఎల్ఏ బ్రహ్మానందరెడ్డికి మింగుడుపడటం లేదు. చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఉపయోగం కనబడలేదట. దాంతో ఏం చేయాలో ఎంఎల్ఏకి అర్ధం కావటం లేదు. ఈమధ్యనే ఎంపి మీడియా సమావేశం పెట్టి రాబోయే ఎన్నికల్లో నంద్యాలలో పోటీ చేయబోయేది తన అల్లుడు శ్రీధరరెడ్డే అంటూ ప్రకటించేశారు.

తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తున్న అఖిలకు పొమ్మనకుండానే చంద్రబాబు పొగపెడుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయట. దానికితోడు చంద్రబాబు జరిపించిన సర్వేలో అఖిల, బ్రహ్మానంరెడ్డిలు గెలవరనే ఫీడ్ బ్యాక్ వచ్చిందంటూ ప్రచారం బాగా ఎక్కువైంది. కాబట్టే చంద్రబాబు వీళ్ళద్దరికీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని అనుకున్నారంటూ పార్టీలో ప్రచారం ఎక్కువైంది. జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అఖిల కూడా జాగ్రత్త పడుతున్నారట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మాట్లాడుకున్నారని సమాచారం. నంద్యాల లో బ్రహ్మానందరెడ్డి, ఆళ్ళగడ్డలో సోదరి భూమా మౌనికకు అసెంబ్లీ టిక్కెట్లిచ్చేట్లు, నంద్యాల ఎంపిగా అఖిలకు టిక్కెట్టిచ్చేట్టు అఖిలకు హామీ ఇచ్చినట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎటూ ఎన్నికల వేడి పెరిగిపోతోంది కదా కొద్ది రోజుల్లోనే విషయం బయటకు వచ్చేస్తుంది లేండి