మావోయిస్టుల హిట్ లిస్టులో ఇంకా చాలామంది టిడిపి నేతలున్నారా ? క్షేత్రస్ధాయిలోని సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు నియోజకవర్గం ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్య తర్వాత పోలీసులు ప్రజాప్రతినిధులందరికీ రెడ్ అలర్ట్ ప్రకటించారు. గ్రామదర్శిని కార్యక్రమానికి వెళ్ళి వస్తున్న నేపధ్యంలో ఎంఎల్ఏ కిడారితో పాటు మాజీ ఎంఎల్ఏ సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినదగ్గర నుండి ప్రజా ప్రతినిధులు ప్రధానంగా తెలుగుదేశంపార్టీ నేతల్లో వణుకు మొదలైంది. మావోయిస్టులు ఎప్పుడు ఎవరిపై విరుచుకుపడతారో తెలీక ఆందోళన పెరిగిపోతోంది.
ఈ నేపధ్యంలోనే పోలీసు ఉన్నతాధికారుల నుండి టిడిపి ప్రజా ప్రతినిధుల అందరికీ నోటీసులు అందుతున్నాయి. నోటీసుల ద్వారా పోలీసులు అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని టిడిపి ప్రజా ప్రతినిధులందరూ వెంటనే విశాఖపట్నం నగరానికి వచ్చేయాలంటూ నోటీసుల్లో స్పష్టంగా చెబుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎవరు కూడా నియోజకవర్గాల్లో తిరగొద్దంటూ గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఎంఎల్ఏ స్ధాయి నుండి ఎంపిటిసి వరకూ అందరికీ హెచ్చరికలు వర్తిస్తాయంటూ స్పష్టంగా చెబుతున్నారు. ఒకవైపు తరుముకొస్తున్న ఎన్నికలు, మరోవైపు మావోయిస్టుల టార్గెట్లతో టిడిపి నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీ విలీన వారోత్సవాలు జరుగుతున్నందున మావోయిస్టులు ఎవరిపై ఏ కోణంలో విరుచుకుపడతారో తెలీకుండా ఉందంటూ పోలీసు ఉన్నతాధికారులే ఆందోళనలో పడ్డారు. నిజానికి మొన్నటి వరకూ జిల్లాలో మావోయిస్టుల జాడే లేదని చెబుతున్నారు. ఏదో మిలీషియా సభ్యుల ఉనికి తప్ప మావోయిస్టులన్న వారినందరినీ ఏరేశామంటూ పదే పదే చెప్పుకున్నారు. తీరా ఇపుడేమైంది ? ఓ ఎంఎల్ఏతో పాటు మాజీ ఎంఎల్ఏని హత్య చేయటంతో ఇపుడందరూ ఉలిక్కిపడ్డారు. ఓ సమాచారం ప్రకారం జిల్లాలోని ఓ ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు తప్ప మిగిలినందరూ మావోయిస్టుల హిట్ లిస్టులోనే ఉన్నారట.