తెలుగుదేశంపార్టీ నేత కోసం మావోయిస్టులు ఇంకా గాలిస్తున్నారా ? గురువారం రాత్రి మళ్ళీ మావోయిస్టులు అరకు వచ్చి తమకు కావాల్సిన నేత కోసం కాసేపు వెతికి తిరిగి వెళ్ళిపోయారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకవైపు తమకోసం పోలీసులు, గ్రేహౌండ్స్ దళాలు గాలింపు జరుపుతున్న విషయం తెలిసి కూడా మావోయిస్టులు తమ టార్గెట్ కోసం మళ్ళీ అరకు వచ్చారంటే…
అరకు ఎంఎల్ఏ కిడారి సర్వేశ్వరరావు హత్య వేడి ఇంకా చల్లారలేదు. ఒకవైపు ఒడిస్సా పోలీసులు, మరోవైపు ఏపి పోలీసులు ఆంధ్ర ఒడిస్సా బార్డర్ (ఏఒబి)ను జల్లెడ పడుతున్నారు. ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏని హత్య చేసిన మావోయిస్టుల కోసం రెండు వైపుల నుండి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే తాజాగా మావోయిస్టులు మరో టిడిపి నేత కోసం అరకు సమీపంలోని బెంజిపూర్ కు వచ్చి వెళ్ళినట్లు సమాచారం.
తాజాగా ఆ విషయం బయటపడటంతో తెలుగుదేశంపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఎంఎల్ఏ, మాజీ ఎంఎల్ఏల హత్య తర్వాత అరకు, డుంబ్రిగుడ ప్రాంతాల్లో పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీసుల కూబింగ్ జరుగుతోంది. అయితే ఆ కూబింగ్ ను ఏమాత్రం లెక్క చేయకుండా ముగ్గురు మావోయిస్టులు గురువారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అరకులోయకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంజిపూర్ కు వచ్చారట.
రోడ్డు పక్కనే ఉన్న బస్ షెల్టర్ వద్ద ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళి అరకు ఎంపిపి, టిడిపి నేత అప్పాలు ఇల్లు ఎక్కడో తెలుసా ? అని అడిగారట. వాళ్ళ వాలకం చూసిన తర్వాత అనుమానం వచ్చిన ఆ యువకుడు తనకు తెలీదని సమాధానం ఇచ్చారట. ఆ ముగ్గురి చేతుల్లో మంచినీళ్ళ బాటిళ్ళు, బుజానికి బ్యాగులు, చేతిలో ఆయుధాలు కనబడటంతో ఆ యువకుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. వాళ్ళ దగ్గర నుండి జారుకున్న యువకుడు ఒక్క పరుగున ఊళ్ళోకి వెళ్ళి ఎంపిపి అరుణకుమారికి, భర్త ఆప్పాలుకు విషయాన్ని చేరవేశాడు.
దాంతో వాళ్ళు కూడా భయపడి పోలీసులకు ఫోన్ చేయటంతో అరకు సిఐ వెంకునాయుడు, ఎసీపీ రస్తోగి ఎంపిపి ఇంటికి చేరుకున్నారు. ఇంత భారీ ఎత్తున కూంబింగ్ జరుగుతున్నా మళ్ళీ మావోయిస్టులు అరకులోకి ప్రవేశించి తమ టార్గెట్ గురించి వాకాబు చేయటంతో ఆశ్చర్యపోయారట. సరే, వారిద్దరిని పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించారనుకోండి అది వేరే సంగతి. అదే విషయమై ఆరుణకుమారి మాట్లాడుతూ మొన్న ఎంఎల్ఏ కిడారిని చంపేసినపుడే మావోయిస్టులు తన భర్త అప్పాలు గురించి కూడా వాకాబు చేసినట్లు చెప్పారు. విషయం చూస్తే మావోయిస్టులు తమ టార్గెట్ ను సరిగ్గానే సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే టిడిపి నేతలకు ఎంత కాలమని పోలీసులు రక్షణ ఇవ్వగలరన్నదే ప్రశ్న.