అధికార పార్టీకి దుబ్బాక ఉప ఎన్నికలు అగ్ని పరీక్ష పెడుతున్నాయి. మొదట్లో ఉప ఎన్నికల్లో తెరాసదే విజయమని,లక్ష మెజారిటీ ఖాయమని అనుకున్నారు. ఆతర్వాత గెలుస్తుంది కానీ లక్ష మెజారిటీ రాకపోవచ్చు అన్నారు. కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలను మార్చి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని అభ్యర్థిగా తెరమీదకు తీసుకురావడంతో అసలు టిఆర్ఎస్ గెలుస్తుందా అంటున్నారు. గెలిచేస్తుంది దగ్గర్నుండి గెలుస్తుందా అనే వరకు పరిస్థితి వచ్చిందంటే దుబ్బాకలో సిట్యూయేషన్ ఎలా ఉంది ఊహించుకోవచ్చు. మామూలుగా ఎన్నిక ఏదైనా కేసీఆర్ సొంత సర్వేలు జరిపించుకుంటారు. మొన్నామధ్యన గ్రేటర్ ఎన్నికలకు సర్వేలు చేయించి 100 సీట్లు గెలుస్తామని అన్నారు.
మరి దుబ్బాకలో కేసీఆర్ సర్వ్ చేయించుకోలేదా, ఒకవేళ చేయించుకుని అందులో ప్రతికూల ఫలితాలు రావడంతో వాటిని బయటకు ప్రస్తావించకుండా మిన్నకుండిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొందరు మాత్రం దుబ్బాక ప్రజలు ఈసారి సానుభూతికి పడిపోయే పరిస్థితి లేదని అంటున్నారు. ఎందుకంటే దుబ్బాక ప్రజలు వరుసగా తెరాసకు పట్టంకట్టినా పెద్దగా అభివృద్ధి ఏదీ జరగలేదట. చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాలు, ఇతర జిల్లాలు కొత్త సొబగులు అద్దుకుంటుంటే దుబ్బాక మాత్రం కొన్నేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉందని జనం అసహనంగా ఉన్నారట.
ఉదాహరణకు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేటను చూపించి అక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ లేదే అంటున్నారట. అందుకే ఈసారి దుబ్బాక ఓటర్లు వేరే పార్టీకి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే టాక్ వినబడుతోంది. సర్వేల్లో సైతం ఈ సంగతే తేలిందని, అందుకే కేసీఆర్ బయటకు చెప్పకుండా హరీశ్ రావును రంగంలోకి దింపి కథ నడిపిస్తున్నారని, హరీశ్ రావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ ఇప్పుడు చేస్తున్నంత గ్రౌండ్ వర్క్ చేయలేదని, దీన్నిబట్టే గతంలో కంటే ఇప్పటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.