ఎదురీదుతున్న జెసి వారసులు

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పోటీ చేస్తున్న జేసి బ్రదర్స్ వారసులు ఎదురీదుతున్నారు. పోయిన ఎన్నికల్లో అనంతపురం, తాడిపత్రి లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో జేసి బ్రదర్స్ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి గెలుపుకు పెద్ద కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన లాంటి ప్రత్యేక పరిస్ధితి, అప్పటికి పదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉండటంతో నేతల్లో కసి, మోడి, పవన్ మద్దతు కలసి వచ్చాయి.

కానీ ఐదేళ్ళ అధికారంలో చాలా పరిస్ధితులు ఎదురుతిరిగాయి. ప్రభుత్వంపై విపరీతమైన అవినీతి ఆరోపణలు, టిడిపి నేతల అరాచకాలు,  ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. దానికితోడు జేసి దివాకర్ రెడ్డికి పార్టీలోనే శతృవులు పెరిగిపోయారు. తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్ధి, సోదరుడు ప్రభాకర్ రెడ్డితో తప్ప మరే ఎంఎల్ఏతో కూడా సఖ్యత లేదు. అసెంబ్లీ అభ్యర్ధుల్లో అత్యధికులు జేసి ఓడిపోవాలనే కోరుకుంటున్నారు.

ఇటువంటి సమయంలోనే జేసి బ్రదర్స్ రాజకీయాల నుండి తప్పుకుని తమ వారసులను తెరపైకి తెచ్చారు. అనంతపురం లోక్ సభకు జేసి పవన్ రెడ్డి, తాడిపత్రిలో జేసి అస్మిత్ రెడ్డి పోటి చేస్తున్నారు.  పార్టీలో జేసి బ్రదర్స్ చేసిన కంపు ఇపుడు వారసులపై పడుతోంది. కాబట్టి వారికి ఆరుగురు ఎంఎల్ఏ అభ్యర్ధులూ సహకరించటం లేదని సమాచారం.

అంటే ఎంపి అభ్యర్ధులంటే ఎంఎల్ఏల అభ్యర్ధులకు పడటం లేదు. అదే విధంగా జేసి వారసులకు కూడా ఎంఎల్ఏల అభ్యర్ధులతో గిట్టటం లేదు. దాంతో కీలకమైన ఎన్నికల సమయంలో కూడా ఎవరిగోల వాళ్ళదే ఎవరి గ్రూపులు వారిదే అన్నట్లుగా తయారైంది. దాంతో అభ్యర్ధుల మధ్య సమన్వయం కొట్టొచ్చినట్లు కనబడుతోందట. కాబట్టే ఎంఎల్ఏ అభ్యర్ధుల గెలుపు మాటను పక్కనపెడితే జేసి వారసులు మాత్రం ఎదురీదుతున్నట్లు అర్ధమవుతోంది.