అనంతపురం టిడిపి మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డి వైసిపిలోకి మారేందుకు ప్లాన్ చేస్తున్నారా ? తాజగా జేసి మాటలు విన్న వారికి అవే అనుమానాలు మొదలయ్యాయి. మీడియాతో జేసి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మావాడే అంటూ స్తోత్రపాఠాలు అందుకున్నారు. మీడియా వాళ్ళెవరూ అసలు జగన్ గురించి ప్రస్తావనే తేలేదు. అయినా జేసినే తనంతట తానుగా ప్రస్తావన తెచ్చారు.
పైగా తానెప్పుడు జగన్ ను వ్యక్తిగతంగా ధ్వేషించలేదని కూడా వివరణ ఇచ్చుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తో తనకున్న సన్నిహితాన్ని గుర్తుచేసుకున్నారు. వైఎస్ అప్పట్లో మరణించకుండా ఉండుంటే తానతో పాటు జానారెడ్డికి మంత్రిపదవులు దక్కేవన్నారు.
జగన్ విజయం ఓ సునామీలాంటిదిగా వర్ణించారు. రాష్ట్రంలో జనాలు మార్పును కోరుకోవటం వల్లే జగన్ కు అఖండ మెజారిటి దక్కిందన్నారు. ప్రత్యేకహోదా సాధనకు జగన్ నెమ్మదిగా ముందుకు సాగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో వినయంగా వ్యవహరించటమే ఇందుకు నిదర్శనంగా చెప్పారు.
వైసిపి, బిజెపిల్లోకి మారే ఆలోచన గురించి అడిగినపుడు ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు. మొత్తం మీద జేసి సోదరులు రాజకీయాల నుండి రిటైర్ అయిన విషయం తెలిసిందే. టిడిపిలోనే ఉంటే తమ వారసులకు భవిష్యత్తు ఉండదని అర్ధమైనట్లుంది. అందుకనే మెల్లిగా వైసిపిలో కర్చీఫ్ వేస్తున్నారు. ఒకవేళ సాధ్యంకాకపోతే బిజెపిలోకి వెళ్ళటానికి కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో తొందరలోనే తేలిపోతుంది.