నియోజకవర్గంలో అందరి నోట ఇపుడిదే మాట వినిపిస్తోంది. వైసిపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ గురించి ప్రతీ ఒక్కళ్ళు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పోయిన ఎన్నికల్లో చీరాలలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత టిడిపిలో చేరారు. అధికార పార్టీలో చేరిందగ్గర నుండి ఆమంచి అరచకాలకు తెరలేపారు. తనకు అనుకూలంగా ఉన్న వారిని అధికారులుగా వేయించుకున్నారు. అప్పటి నుండి ప్రత్యర్ధులపై చెలరేగిపోయారు.
గడచిన నాలుగేళ్ళల్లో ఆమంచి అరాచకాలు అన్నీ ఇన్నీ కావని అంటున్నారు. వైసిపి నేతలనే కాదు చివరకు టిడిపిలోని ప్రత్యర్ధులపైన కూడా పోలీసులను ఉసిగొలిపారు. తనంటే గట్టినివారిపైనే కాకుండా తనకు ఎదురుతిరిగిన వారిపైన కూడా కేసులు పెట్టించారు. దాంతో అన్నీ వైపుల నుండి ఆమంచిపై వ్యతిరేకత పెరిగిపోయింది.
ఇటువంటి సమయంలో హఠాత్తుగా టిడిపికి రాజీనామా చేసిన ఆమంచి వైసిపిలో చేరారు. ఆమంచి తమ పార్టీలో చేరటం చూసిన వైసిపి నేతలకు షాక కొట్టినట్లైంది. ఎందుకంటే, నియోజకవర్గంలోని నేతలతో ఏమాత్రం సంబంధం లేకుండానే పై స్ధాయిలో మాట్లాడుకుని వైసిపిలో చేరిపోయారు. ఆమంచి పార్టీ మారటం టిడిపికి ప్లస్ అయితే వైసిపికి మైనస్ అనే చెప్పాలి.
ఇటు టిడిపి, అటు వైసిపిలోని ఆమంచి బాధితులంతా కలిసి ఇపుడు ఆమంచికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని సమాచారం. నిజానికి చీరాలలో టిడిపికైనా వైసిపికైనా గట్టి నేత లేరు. అందుకే ఆమంచిని జగన్ చేర్చుకుంటే చంద్రబాబేమో అద్దంకిలోని కరణం బలరామ్ కు చీరాలలో టికెట్ ఇచ్చారు. ఎప్పుడైతే చీరాలలో కరణం పోటీకి దిగారో ఆమంచి వ్యతిరేకులంతా మద్దతుగా నిలబడ్డారు. వైసిపికి అండర్ కరెంట్ ఉందా లేదా అన్న విషయాన్ని పక్కనపెడితే ఆమంచి విషయంలో జగన్ ఛాయిస్ బ్యాడ్ అనే ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది.