ప్రజల్లోకి మళ్ళీ జగన్..12 నుండేనా ? వైసిపిలో ఫుల్ జోష్

అర్ధాంతరంగా నిలిపేసిన ప్రజా సంకల్పయాత్రను జగన్మోహన్ రెడ్డి మళ్ళీ  మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈనెల 12వ తేదీ నుండి పాదయాత్రను ప్రారంభించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోయిన నెల 25వ తేదీన హైదరాబాద్ రావటానికి విశాఖపట్నం విమనాశ్రయంలో వెయిట్ చేస్తున్న జగన్ పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. హత్యాయత్నంలో జగన్ ఎడమభుజం క్రింద బలమైన గాయమవటంతో హైదరాబాద్ లో డాక్టర్లు తొమ్మది కుట్లు వేశారు. గాయం లోతుగా అవటంతో చెయ్యిని కదల్చటం కష్టంగా ఉంది. దాంతో డాక్టర్లు సలహా మేరకు పాదయాత్రను జగన్ ఆపేశారు.

 

 నాలుగు రోజుల క్రితమే పాదయాత్రను ప్రారంభించాలని అనుకున్నా డాక్టర్లు అంగీకరించలేదు. కనీసం 15 రోజుల విశ్రాంతి అవసరమని లేకపోతే దీర్ఘకాలంలో భుజానికి సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు స్పష్టం చేయటంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఒకవైపు భుజం నొప్పి మరోవైపు పాదయాత్ర మొదలుపెట్టాలనే బలమైన కోరికతో ఏం చేయాలో జగన్ కు అర్ధం కావటం లేదు. చిరవకు భుజం కాస్త తగ్గటంతో పాదయాత్రకు రెడీ అయిపోతున్నారట. ఈనెల 12వ తేదీనుండి పాదయాత్రను ప్రారంభించాలని జగన్ తాజాగా నిర్ణయించారని సమాచారం.

 

పాదయాత్రను విజయనగరం జిల్లాలో ఎక్కడైతే నిలిపేశారో అక్కడి నుండే మొదలవ్వనున్నది. ఈనెలాఖరుకు విజయనగరం జిల్లాలో పాదయాత్ర పూర్తవుతుంది. వెంటనే శ్రీకాకుళం జిల్లాలో మొదలవుతుంది. జిల్లాలోని ఇచ్చాపురంతో పాదయాత్ర ముగుస్తుంది. ఇప్పటి వరకూ 205 రోజులు జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. మొన్న 6వ తేదీకి పాదయాత్ర మొదలుపెట్టి ఏడాది పూర్తయ్యింది. 3211 కిలోమీటర్లు నడిచారు. మొత్తానికి జగన్ పాదయాత్ర దేశ రాజకీయ చరిత్రలోనే ఓ సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. పాదయాత్రలో సరికొత్త అధ్యాయమనే చెప్పాలి.