జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారా ?

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బిజెపి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తోంది. జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన ఆరోపణలు విచిత్రంగా ఉంది. టిడిపి అవినితీని భరించలేక వైసిపి పట్టంకట్టినట్లు చెప్పారు. అయితే వైసిపి కూడా టిడిపి బాటలోనే నడుస్తోందని చెప్పటమే విడ్డూరంగా ఉంది.

నిజానికి చంద్రబాబు ఐదేళ్ళ పాలనను జగన్ రెండు నెలల పాలనతో పోల్చేందుకే లేదు. జగన్ పైన విశ్వాసం ఉంచే అఖండ మెజారిటి అందించారన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు పాలన మొత్తం అవినీతిమయమైతే వైసిపి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఇంత వరకూ ఎక్కడా వినబడలేదు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు.

ఈ విషయం తెలిసినా బిజెపి నేతలు ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు ? ఎందుకంటే ఎంఎల్ఏల ఫిరాయింపులకు జగన్ అడ్డంకిగా నిలిచారు కాబట్టే. టిడిపి ఎంఎల్ఏలు కొందరు బిజెపిలోకి ఫిరాయించాలని ఉన్నా భయంతో ఆగిపోయారు. పార్టీ ఫిరాయిస్తే వెంటనే వాళ్ళపై అనర్హత వేటు వేయమని జగన్ చెప్పేశారు. దాంతో అనర్హత వేటుకు భయపడే ఇంకా టిడిపిలోనే కంటిన్యు అవుతున్నారు.

అదే సమయంలో తాను ప్రవేశపెడుతున్న బిల్లులు, పథకాలతో జగన్ జనాల్లో మంచిపేరు తెచ్చుకుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసిపికి ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బిజెపికి ఓట్లు పడేది అనుమానమైపోయింది. అందుకే జగన్ పై ఇప్పటి నుండే ఆరోపణలు, విమర్శల స్ధాయిని పెంచేస్తోంది బిజెపి. ఎవరిపై ఎన్ని విమర్శలు చేసినా బిజెపికి ఓట్లు పడేది డౌటే అన్నట్లే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో ?