వైసిపిలో 12 మంది అభ్యర్ధులు ఫైనల్ అయ్యారా ?

రాబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులపై పెద్ద ఎత్తునే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికి 12 మంది అభ్యర్ధులను ఖరారు చేసినట్లుగా సోషల్ మీడియాలో ఓ వార్త సర్క్యులేషన్ లో ఉంది. 12 మందిలో రాయలసీమకు చెందిన ముగ్గురు, కోస్తా జిల్లాల నుండి నలుగురు పేర్లు, ఉత్తరాంధ్రలోని నలుగురు, ఉభయ గోదావరి జిల్లాలో ఒకరి అభ్యర్ధిత్వం ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చివరి నిముషంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు లేండి.

ఇక, రాయలసీమ జిల్లాలైన కడపలో అవినాష్ రెడ్డి, రాజంపేటలో మిధున్ రెడ్డి, కర్నూలులో బివై రామయ్యల పేర్లున్నాయి. వీరిలో అవినాష్ రెడ్డి, మిధున్ రెడ్డి ఇద్దరూ ప్రత్యేకహోదా కోసం ఎంపిలుగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కర్నూలు నుండి బివై రామయ్య పేరు కొత్తది. బిసి సామాజికవర్గానికి చెందిన బివై ప్రస్తుతం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.

కోస్తా జిల్లాలైన ఒంగోలులో వైవి సుబ్బారెడ్డి, విజయవాడలో దాసరి జై రమేష్, నెల్లూరులో మేకపాటి రాజమోహన్ రెడ్డి, మచిలీపట్నంలో బాలశౌరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో వైవి, మేకపాటి హోదా కోసం పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. దాసరి, బాలశౌరి పేర్లు కొత్తవి. అయితే, వైవికి వచ్చే ఎన్నికల్లో టికెట్ అనుమానమే అనే ప్రచారం కూడా ఎక్కువగా ఉందన్న విషయం గమనించాలి. అవసరమైతే మేకపాటిని నెల్లూరు నుండి ఒంగోలుకు మార్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉత్తరాంధ్రకు చెందిన విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం అభ్యర్ధులు దాదాపు ఖారారైనట్లేనట. విశాఖపట్నం నుండి బిల్డర్ ఎంవివి సత్యనారాయణ, అనకాపల్లి నుండి వరుదు కల్యాణి, విజయనగరం నుండి బొత్స ఘాన్సీ, శ్రీకాకుళం నుండి దువ్వాడ శ్రీనివాస్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ పేర్లలో శ్రీకాకుళం నుండి దువ్వాడ చివరి నిముషంలో మారొచ్చంటున్నారు. ఈమధ్యనే చేరిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి పేరు కూడా ఎంపి అభ్యర్ధిగా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉభయగోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాల్లో అమలాపురం నుండి చింతా అనూరాధ దాదాపు ఖాయమనే పార్టీ వర్గాలు చెబుతున్నాయి.