తెలంగాణలో కేసీఆర్ హవా అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆయన వాగ్డాటి ముందు, రాజకీయ బలం ముందు ప్రత్యర్థులంతా తెలిపోయేవారే తప్ప ఆయన్ను ధీటుగా ఎదుర్కొని నిలబడేవారు లేకపోయారు.
కొన్నాళ్లుగా ఆ లోటును రేవంత్ రెడ్డి భర్తీ చేస్తున్నారు. తెలుగుదేశం నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అందుకున్నారు. వచ్చీ రాగానే రేవంత్ ఇలా కీలక పదవి పొందడం కాంగ్రెస్ సీనియర్లకు అస్సలు నచ్చలేదు. రేవంత్ మాత్రం కేసీఆర్ మీద గ్యాప్ లేకుండా విమర్శలు చేస్తూ, తెరాస నాయకుల అవినీతిని వెలికితీస్తాను అంటూ దూకుడుగా వెళ్తున్నారు. ఎంత దూకుడుగా అంటే ఒక్కోసారి ఆయన్ను తట్టుకోవడం కేసీఆర్ వల్ల కూడ అయ్యేది కాదు. కేసీఆర్ ప్రత్యేకంగా ఆలోచించే ఒకే ఒక్క నేత రేవంత్ రెడ్డి.
అలా ఉన్నాడు కాబట్టే టీపీసీసీ చీఫ్ పదవి రేసులో రేవంత్ పేరుంది. కానీ వీహెచ్, జగ్గారెడ్డి లాంగి సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డికి పదవి రాకుండా అడ్డుపడుతున్నారు. ఇదే రేవంత్ రెడ్డికి విసుగు తెప్పిస్తోంది. కేసీఆర్ స్పీడుకు బ్రేకులు వేయాలనే లక్ష్యంతో తానుంటే సొంత పార్టీ వారు తనకే కాళ్లు అడ్డంపెడుతున్నారని, దీనికి పరిష్కారం సొంత పార్టీ పెట్టుకోవడమేనని రేవంత్ భావిస్తున్నారట. రేవంత్ ఆలోచన తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగేశారట. తనను ముప్పుతిప్పలు పెట్టిన కేసీఆర్ పనిపట్టాలంటే రేవంత్ రెడ్డిని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా చేయడమే కరెక్టనేది బాబుగారి ఉద్దేశ్యమట.
రేవంత్ రెడ్డి మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్. సొంత పార్టీ పెడితే రెడ్డి సామాజికవర్గం ఆయన వైపు తిరిగే అవకాశం ఉంది. పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళి స్థానికంగా బలమైన నేతలు రేవంత్ రెడ్డితో కలిస్తే కేసీఆర్ నుండి రెడ్లను దూరం చేయవచ్చని, రాష్ట్రవ్యాప్తంగా చెల్లాచెదురైపోయిన టీడీపీ శ్రేణులను కూడ రేవంత్ రెడ్డివైపు మళ్లించి తెరాసను దెబ్బకొట్టాలి అనేది చంద్రబాబు పన్నాగమని, రేవంత్ సైతం బాబు ఆలోచనను సమర్థిస్తున్నారని టాక్. ఒకవేళ ఇదే గనుక జరిగి రేవంత్ బాబుగారి నైతిక మద్దతుతో పార్టీ పెట్టి తన నియోజకవర్గం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకోగలిగితే కేసీఆర్ ఇబ్బందిపడక తప్పదు.