అవును హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసే ఆశావహులలో ఇపుడు మూడో కృష్ణుడు రంగ ప్రవేశం చేశారు. ఐపిఎస్ మాజీ అధికారి మహ్మద్ ఇక్బాల్ హిందుపురంలో పోటీ చేసే విషయంలో ఆసక్తి చూపుతున్నారు. ఈయనది కర్నూలు జిల్లానే అయినప్పటికీ అనంతపురం జిల్లాలోని హిందుపురం అసెంబ్లీకి పోటి చేసే విషయంలో ఆసక్తి చూపుతున్నారట. హిందుపురంలో ఉన్న బంధుత్వం, ఉద్యోగం సందర్భంగా జిల్లాతో ఉన్న అనుబంధం దృష్ట్యా ఇక్కడి నుండి పోటీకి ఆయన బాగా ఇంట్రస్టు చూపుతున్నారు.
పోయిన ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణపై వైసిపి అభ్యర్ధిగా నవీన్ నిశ్చల్ పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో కూడా నవీనే అభ్యర్ధిగా అనుకున్నారు. పార్టీ కార్యక్రమాలను కూడా నవీన్ బాగానే జనాల్లోకి తీసుకెళ్ళారు. అటువంటి సమయంలో జగన్ హఠాత్తుగా టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ అబ్దుల్ ఘనీని పార్టీలోకి చేర్చుకున్నది. ఘనీ రెండుసార్లు హింపుపురం ఎంఎల్ఏగా గెలిచారు. బాలకృష్ణ కోసం నియోజకవర్గాన్ని వదులు కోవాల్సొచ్చింది.
ఎలాగూ ఘనీ మాజీ ఎంఎల్ఏ పైగా మైనారిటీకి చెందిన నేత కాబట్టి టికెట్ ఆయనకు ఖాయమనుకున్నారు. ఎందుకంటే, టికెట్ హామీతోనే వైసిపిలో చేరారని సమాచారం. ఎన్నికలు కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఘనీ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో హఠాత్తుగా ఇక్బాల్ రంగ ప్రవేశం చేశారు.
ఇక్బాల్ కూడా మైనారిటీ వ్యక్తే కాబట్టి జగన్ కూడా ఈయనవైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. మరి అదే నిజమైతే నవీన్, ఘనీలు ఏమైపోవాలి. టికెట్ హామీతోనే ఘనీని తీసుకున్నపుడు జగన్ మాట నిలబెట్టుకోవాలి కదా ? ఘనీ కన్నా ఇక్బాలే గట్టి అభ్యర్ధి అనుకున్నపుడు ముందుగా ఇక్బాల్ నే ఇక్కడకు పంపితే సరిపోయేది. ఎందుంకటే ఘనీ కన్నా ముందే ఇక్బాల్ పార్టీలో చేరారు. లేదు రేపు ఇక్బాల్ కన్నా గట్టి అభ్యర్ధి వస్తే అప్పుడు ఇక్బాల్ పరిస్ధితేంటి ?
ఫొటో : ఆంధ్రజ్యోతి సౌజన్యం