వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా సంకల్పయాత్ర త్వరలో 3 వేల కిలోమీటర్ల రికార్డును చేరుకుంటోంది.
పోయిన ఏడాది నవంబర్ 6వ తేదీన కడప జిల్లా పులివెందులలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర మొదటి అడుగు విజయనగరం జిల్లా కొత్తవలసలో 3 వేల కిలోమీటర్ల రికార్డును బ్రేక్ చేయనుంది. ఈనెల 24 తేదీన జగన్ విజయనగరం జిల్లాలోకి అడుగుపెడుతున్నారు. జిల్లాలొకి జగన్ అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా వైసిపి నేతలు ఓ పైలాన్ ను ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న బొత్సా సత్యనారాయణది కూడా విజయనగరం జిల్లానే కావటంతో ఏర్పాట్లన్నింటినీ బొత్సానే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు.
అదే విషయమై ప్రజాసంకల్పయాత్ర వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటున్నసీనియర్ నేత తలశిల రఘురామ్ మీడియాతో మాట్లాడుతూ, జగన్ పాదయాత్రకు జనాలు అపూర్వ స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. ఏ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నా జనాల స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావటం ఖాయంగా తోస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ పాదయాత్ర పూర్తి చేసిన జిల్లాలో ఒక జిల్లాను మించి మరోక జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పట్టినట్లు తెలిపారు.
విశాఖపట్నంలోకి పాదయాత్ర ప్రవేశించినపుడు లభించిన ఆదరణ, కంచర్లపాలెం బహిరంగసభకు హాజరైన జనాలను చూసిన తర్వాత చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందన్నారు. అందుకనే పాదయాత్రకు అంతరాయాలు కల్పిస్తున్నట్లు ఆరోపించారు. యాత్ర సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన పోలీసు భద్రతను కూడా కల్పించటం లేదని మండిపడ్డారు. పాదయాత్ర రూట్ మ్యాప్ ను ముందుగానే తాము జిల్లాల అధికారులకు అందిస్తున్నా ముందస్తు జాగ్రత్తలు చేయకపోవటం దారుణమన్నారు. ఇదంతా ప్రభుత్వం కల్పిస్తున్న అంతరాయాల్లో భాగమేనంటూ చెప్పటం గమనార్హం.