రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారనే విషయం చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కుమారుడు హితేష్ త్వరలోనే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనేది దాని సారాంశం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిల ఏకైక కుమారుడు హితేష్.
పురంధేశ్వరి తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగి, కుమారుడికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్నారు. 2004 ఎన్నికలకు ముందు పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆమె బీజేపీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.
వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. కాంగ్రెస్, బీజేపీల్లో ఆమె క్రియాశీలకంగా కొనసాగినప్పటికీ..తన కుమారుడి రాజకీయ అరంగేట్రానికి మాత్రం ఆమె ఆ రెండు పార్టీల పట్ల విముఖత చూపుతున్నారు. దీనికి కారణం- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే.
టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ పురంధేశ్వరి చంద్రబాబు వైఖరిని, రెండు నాల్కల విధానాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే వచ్చారు. బీజేపీలో జాతీయ స్థాయి పదవిలో ఉన్నప్పటికీ పురంధేశ్వరి ఆ పార్టీపై పెద్దగా ఆసక్తి చూపట్లేదు. రాష్ట్రంలో సంస్థాగతంగా గానీ, క్షేత్రస్థాయిలో గానీ బలంగా లేని బీజేపీ నుంచి కాకుండా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన కుమారుడు రాజకీయాల్లో ప్రవేశిస్తే బాగుంటుందనేది దగ్గుబాటి దంపతుల ఆలోచన.