చూడబోతే వ్యవహారం అలాగే కనిపిస్తోంది. తెలుగుదేశంపార్టీకి ఓటు వేసేదెవరు ? వేయనివారు ఎవరు ? అన్న విషయంలో ఓ క్లారిటీ వచ్చిన తర్వాతే ఓటర్ల జాబితాలో నుండి పేర్లు గల్లంతవుతున్నట్లు పలువురికి అనుమానంగా ఉంది. అందుకు ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగవిరమణ చేసిన ఐవైఆర్ కృష్ణారావు చేసిన ట్వీట్ మరిన్ని అనుమానాలను పెంచేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోను లక్షలాది ఓట్లు గల్లంతైన విషయం అందరికీ తెలిసిందే. గల్లంతైన ఓట్ల కోసం పలువురు లబోదిబో మంటున్నారు.
రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఉద్దేశ్యపూర్వకంగానే జాబితాలో నుండి పేర్లను తొలగించేస్తున్నట్లు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తెలంగాణాలో అయతే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదే విషయమై కోర్టుకు కూడా వెళ్ళారు. కేసు విచారణలో ఉందనుకోండి. ఇక ఏపి విషయానికి వస్తే మొత్తం మీద సుమారు 30 లక్షల ఓట్లు జాబితాలో నుండి ఎగిరిపోయినట్లు ప్రధాన ప్రతిపక్షం వైసిపి నేతలు మండిపోతున్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే తమకు ఓటు వేయరు అన్న అనుమానం ఉన్న వారి పేర్లను ఓటర్ల జాబితాలో నుండి టిడిపి నేతలే అధికారులపై ఒత్తిడి తెచ్చి పేర్లను తీయించేస్తున్నట్లు మండిపోతున్నారు. గల్లంతవుతున్న ఓట్లు కూడా పోయిన ఎన్నికల్లో వైసిపికి పడినవిగా అనుమానం ఉన్న వారివే కావటంతో అందిరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇటువంటి నేపధ్యంలోనే ఐవైఆర్ చేసిన ట్వీట్ ఒకటి అందరి అనుమానాలను పెంచేస్తోంది.
ఇంతకీ ఐవైఆర్ ట్వీట్ ఏమిటంటే ముఖ్యమంత్రి నుండి ఫోన్ వస్తుందట. పాలనపై సంతృప్తిగా ఉన్నారా ? లేకపోతే అసంతృప్తితో ఉన్నారా ? అంటూ అడుగుతారట. ఎవరైనా అసంతృప్తిగా ఉన్నాము అంటే వెంటనే ఫోన్ కట్ చేస్తున్నారట. ఆ విషయాన్నే ఐవైఆర్ ప్రస్తావిస్తు పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నామని చెప్పిన వాళ్ళు ఎందుకైనా మంచిదని కొన్ని రోజుల తర్వాత ఓటర్లజాబితాలో పేరుందో లేదో చూసుకోమంటూ సలహా ఇచ్చారు. అంటే అర్ధమేంటో అందరికీ అర్ధమైపోతోందిగా ? మీకు కూడా ఫోన్ వచ్చుంటే ఓసారి జాబితాను చూసుకోండి మరి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ప్రభుత్వ పాలన తో మీరు సంతృప్తి గా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారాఅని. అసంతృప్తిగా ఉన్నామని సమాధానం చెబితే ఎందుకైనా మంచిది కొన్నాళ్ల తర్వాత ఓటర్ జాబితాలో పేరు ఉన్నది లేనిది చూసుకోవడం ఉత్తమం.
— IYRKRao , Retd IAS (@IYRKRao) October 7, 2018