చంద్రబాబు నాయుడు వైఖిరి గమనిస్తున్న వారందరూ ఇప్పుడు ఏదో జరగబోతుందని అనుకుంటున్నారు. నిజమే… గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల మీద కానీ , రాష్ట్రంలో బీజేపీ నాయకులు తమ మీద చేస్తున్న ఆరోపణల మీద కానీ టీడీపీ అధ్యక్షుడు స్పందించటంలేదు. కమలంపార్టీ నేతల ఆరోపణలకు ధీటుగా స్పందించే నేతలు టీడీపీలో చాలామందే ఉన్నా వాళ్ళు కూడా ఎందుకు మిన్నుకుండిపోతున్నారు. బీజేపీ పార్టీకి భయపడిపోతున్నారా లేక స్నేహబంధం కోసం పరితపిస్తున్నారు అన్న సందేహం అందరిలోనూ ఉందట.
ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశంలో బీజేపీ నేతల వైఖరిని సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రస్తావించారు. బీజేపీ ఆరోపణలు, విమర్శలకు ధీటైన సమాధానం చెప్పకపోతే జనాలు వాటిని నిజాలనుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఎటాక్ చేయకుండా టీడీపీ హయాంలో కూల్చేసిన దేవాలయాల గురించి బీజేపీ నేతలు కావాలనే ప్రస్తావిస్తున్నారంటూ సోమిరెడ్డి మొత్తుకున్నారు. వైసీపీని విమర్శలు చేయాల్సిన బీజేపీ నేతలు ఆపని చేయకుండా టీడీపీని టార్గెట్ చేస్తుంటే మనమెందుకు ఊరుకోవాలని ప్రశ్నించారు.
సోమిరెడ్డి మాట్లాడిందతా విన్న చంద్రబాబు చివరకు బీజేపీ నేతలపై ఎవరు మాట్లాడద్దంటూ ఆదేశించారు. బీజేపీ నేతల ఆరోపణలు, విమర్శలకు సమాధానాలు చెప్పటంలో తప్పులేదు కానీ గట్టిగా మాట్లాడి దాడులు చేయవద్దని స్పష్టంగా చెప్పేశారు. ఎట్టి పరిస్ధితుల్లోను బీజేపీ నేతలపై గట్టిగా మాట్లాడద్దని చెప్పేశారు. ఎప్పటికైనా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసిందే. అసలే చంద్రబాబు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఇంతకాలం తాను ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళంతా జగన్ దెబ్బకి చెల్లా చెదురైపోయారు.ఈ కారణంగానే చంద్రబాబు ఆశలన్నీ బీజేపీపైనే పెట్టుకున్నారు. మోడీ ఏనాటికైనా అభయ హస్తం అందించకపోతాడా అని ఎదురు చూస్తున్న బాబు గారి ఆశ నెరవేరుతుందో లేదో?