ఎనిమిది మంది ఎంఎల్ఏలకు షాక్ తప్పదా ?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కొత్త ముఖాలు కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎంఎల్ఏల పనితీరుపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ? అందుకనే దాదాపు ప్రతీ నెలా ఓ సర్వే చేయించుకుంటున్నారు. సర్వే నివేదికల ఆధారంగా పార్టీ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం ఎనిమిది నియోజకవర్గాల్లో కొత్త వారికి టిక్కెట్లు ఖాయమని తెలుస్తోంది. ఇపుడున్న ఎంఎల్ఏల్లో చాలామందిపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. అందుకే కొత్త వారికి టిక్కెట్లిస్తే బాగుంటుందని చంద్రబాబు నిర్ణయించారట.

 

పోయిన ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ 12 చోట్ల గెలిచింది. వైసిపి తరపున గెలిచిన  ఇద్దరిలో ఒకరు టిడిపిలోకి ఫిరాయించారు. సరే ఫిరాయింపుల విషయాన్ని పక్కనపెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం టిడిపి ఎంఎల్ఏల అడ్డుగోలు సంపాదనకు అంతులేకుండా పోయింది. టిడిపిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోని ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారా అంటే టార్చిలైట్ వేసి వెతకాల్సిందే. దాంతో సహజంగానే ప్రజా ప్రతినిధులపై వ్యతిరేకత పెరిగిపోతుంది. దానికితోడు నాలుగున్నరేళ్ళ చంద్రబాబు పాలనలో అన్నీ వర్గాలు మండిపోతున్నాయి.   

 

జిల్లాకు సంబంధించి అనంతపుం పార్లమెంటు నియోజకవర్గంలో సుమారు ఐదు నియోజకవర్గాల్లోను, హిందుపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో మూడు నియోజకవర్గాల్లోను అభ్యర్ధుల మార్పు తప్పదని సమాచారం. ఇపుడు పై పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఎల్ఏల్లో అత్యధికులపై జనాలతో పాటు పార్టీ నేతలు, క్యాడర్ కూడా బాగా మండిపోతున్నారట.

 

అనంతపురం ఎంపి జేసి దివాకర్ రెడ్డి ఈ విషయం మొదటి నుండి చెబుతున్నదే. జిల్లాలోని 13 మంది ఎంఎల్ఏల్లో కనీసం 10 మందికి టిక్కెట్లు మార్చకపోతే అన్నీ నియోజకవర్గాల్లోను ఓడిపోవటం ఖాయమని చంద్రబాబు మొహం మీదే జేసి జోస్యం చెప్పటం అప్పట్లో సంచలనం రేపింది. పది నియోజకవర్గాల్లో అభ్యర్ధులను మార్చాల్సిందే అంటు చెప్పిన జేసి కొత్తగా అభ్యర్ధుల జాబితాను కూడా అందించారు.

 

అప్పటి నుండి జిల్లా టిడిపిలో ఎక్కువమంది ఎంఎల్ఏలు జేసిపై మండిపోతున్నారు. సో, జేసి వ్యాఖ్యలు ఇపుడు జరుగుతున్న విషయాలను చూస్తే కనీసం ఎనిమిది నియోజకవర్గాల్లో కొత్తమంది అభ్యర్ధులు పోటీకి దిగటం ఖాయమని తెలుస్తోంది. మరి చంద్రబాబు ఎవరిని రంగంలోకి దింపుతారో చూడాల్సిందే.