పవన్ ను చూసి చంద్రబాబు భయపడుతున్నారా ?

జనసేన అంటే చంద్రబాబునాయుడు భయపడుతున్నారా ?  ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో పవన్ మాట్లాడుతూ జనసేన అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో బహిరంగంగానే చెప్పారు. ఇంతకీ జనసేన అంటే చంద్రబాబుకు ఎందుకంత భయం ? ఎందుకంటే జనసేన పార్టీకి 18 శాతం ఓట్లున్నాయట. నిజమేనా అని ఎవరూ అడక్కూడదు. ఎందుకంటే, చెప్పింది పవన్ కాబట్టి.

 

అభిమానులతో పవన్ మాట్లాడుతూ, వాళ్ళు వీళ్ళు చెబుతున్నట్లు జనసేనకు ఉన్నది  4 శాతమో లేకపోతే 5 శాతం ఓట్లో కాదన్నారు. నిజంగానే వాళ్ళు చెబుతున్నట్లు మనకు 4 లేకపోతే 5 శాతం ఓట్లుంటే అసలు చంద్రబాబు మనల్ని లెక్క చేస్తారా ? అంటూ అడిగారు.  జనసేనకు 18 శాతం ఓట్లున్నాయి కాబట్టే మనమంటే భయపడుతున్నారు అంటూ పవన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.  

 

నిజానికి జనసేనకు ఇన్ని శాతం ఓట్లున్నాయి అనటానికి కొలమానమేది లేదు. ఎందుకంటే, పార్టీ పుట్టి ఐదేళ్ళయినా ఇంత వరకూ ఒక్క ఎన్నికలోనూ పోటీ చేసింది లేదు. కనీసం నంద్యాల ఉపఎన్నికో లేకపోతే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలోనో పోటీ చేసుంటే ఓ ఐడియా ఉండేది. ఇప్పటి వరకూ జనసేనకు 5 శాతం ఓట్లున్నాయన్న ప్రచారం కూడా వివిధ మీడియా సంస్ధలు చేసిన సర్వేల్లో తేలిన అంశమే. వచ్చే ఎన్నికలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లొస్తాయనే విషయంపై జాతీయ మీడియా సంస్ధలు సర్వే చేస్తే  సగటున 5 శాతం ఓట్లు వస్తాయని తేలింది. దాన్ని బట్టే అందరూ జనసేన విషయంలో అందరూ ఓ అంచనాకు వచ్చారు.

 

పవన్ చెబుతున్న 18 శాతం ఓట్లు 2009లో ప్రజారాజ్యంపార్టీకి వచ్చాయి.  బహుశా ఆ ఓట్ల శాతమే తనకు కూడా వస్తాయని పవన్ అనుకుంటున్నారేమో ? అప్పట్లో పిఆర్పి అన్ని శాతం ఓట్లొచ్చాయంటే అందుకు కారణం అప్పట్లో ఆ పార్టీ తరపున చాలా చోట్ల గట్టి నేతలే పోటీ చేశారు. మరి, పవన్ పార్టీలో ఇప్పటికైతే గట్టి నేతలంటే అవుడేటెడ్ ముత్తా గోపాలకృష్ణ, పర్టీ బలం మీదే ఆధారపడే నాదెండ్ల మనోహర్ మాత్రమే. ఇటువంటి వాళ్ళను నమ్ముకుని పవన్ ఎన్నికల గోదారిని ఈదాలని అనుకుంటే చివరకు జాతీయ మీడియా సర్వేలే నిజమవుతాయేమో ?