చంద్రబాబుపై సీఈసీ సీరియస్ ? అందుకేనా వివరణ ఇచ్చుకున్నది

అడుసు తొక్కనేల..కాలు కడగనేల ? అనేది తెలుగులో బాగా పాపులర్ సామెత. ఈ సామెత చంద్రబాబునాయుడుకు బాగా సరిపోతుందనటంలో సందేహమే లేదు. ఎన్నికల కమీషన్ ను నోటికొచ్చినట్లు తిట్టేసి ఇపుడు తీరిగ్గా జనాలకు వివరణ ఇచ్చుకుంటున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుపతి పార్టీ కార్యాలయంలో మాట్లాడిన తీరు చూస్తుంటే ఇసిని నోటికొచ్చినట్లు తిట్టటం తప్పే అని ఒప్పుకున్నట్లే ఉంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల సంఘం కొన్ని బదిలీలు చేసింది. దానిపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు చంద్రబాబు. నిజానికి చంద్రబాబుకు అభ్యంతరాలు చెప్పేంత సీన్ లేదు. అయినా చంద్రబాబు కదా అందుకే కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. సరే దానికి తగ్గట్లే ముందు సీఈసీ తర్వాత కోర్టు యాక్ట్ చేయటంతో మాట్లాడకుండా కూర్చున్నారు.

ఇక అప్పటి నుండి సీఈసిని ఎన్ని రకాలుగా శాపనార్ధాలు పెట్టారో అందరికీ తెలిసిందే. అలాంటి చంద్రబాబు తిరుపతిలో తమ వైఖరికి భిన్నంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే పోరాటం చేస్తున్నారట. ఎన్నికల నిర్వహణలో సంస్కరణలు తేవాలన్నదే తన ఉద్దేశ్యంగా చెప్పుకున్నారు. తన పోరాటాల ఫలితంగానే వివి ప్యాట్లు వచ్చాయన్నారు. ఈసిపై తాను చేసిన వ్యాఖ్యలన్నీ కోపంతో చేసినవిగా కాకుండా బాధతో చేసినవిగా చూడాలన్నట్లు చెప్పుకున్నారు.

ఇలాంటి మాటలు చాలానే మాట్లాడారు. సరే ఇంత హఠాత్తుగా చంద్రబాబులో మార్పొ ఎందుకొచ్చింది ?  ఎందుకంటే, కార్యాలయానికి వెళ్ళి మరీ  ఈసి గోపాల కృష్ణ ద్వివేదిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దానిపై కేంద్ర ఎన్నికల కమీషన్ చాలా సీరియస్ అయ్యింది. కార్యాలయానికి వచ్చి ద్వివేదిని ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఇంగ్లీషులోకి తర్జుమా చేసి పంపమని సీఈసీ ఆదేశించింది.

సరే సీఈసీ ఆదేశాలకు అనుగుణంగానే ద్వివేది కూడా అనువాదం చేసి పెద్ద నివేదికనే పంపారు. దాంతో చంద్రబాబుపై సీఈసీ కేసు పెట్టటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎన్నికల కమీషనర్ నే బెదిరించటమంటే మాటలు కాదు కదా ? ఎలక్షన్ కేసుల్లో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే చంద్రబాబులో ఇపుడు టెన్షన్ మొదలైందట. ముందు నోటికొచ్చినట్లు తిట్టేయటం తర్వాత తన ఉద్దేశ్యం అదికాదంటూ కాళ్ళ బేరానికి రావటం బేల మాటలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటే కదా ?