తెలుగుదేశంపార్టీ ఆరోపిస్తున్నట్లు నిజంగానే వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి డబ్బు మనిషేనా ? తాజాగా వైసిపికి రాజీనామా చేసిన నెల్లూరు జిల్లా నేత చేసిన ఆరోపణలు చూస్తుంటే అవే అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని సమన్వయకర్తగా జగన్ నియమించారు. నాలుగేళ్ళుగా సమన్వయకర్తగా పనిచేస్తున్న తనను కాదని, కనీసం తనతో చెప్పకుండానే ఆనంను కొత్తగా నియమించటంతో ఒళ్ళుమండిన జిల్లా పరిషత్ ఛైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
పార్టీకి రాజీనామా చేయటంతో పాటు జగన్ పై ఆరోపణలు గుప్పించారు. ఆయన చేసిన ఆరోపణల్లో జగన్ డబ్బు మనిషి అనేది ప్రధానమైనది. జగన్ డబ్బుకు మాత్రమే విలువిస్తారంటూ బొమ్మిరెడ్డి చేసిన తాజా ఆరోపణలు జిల్లాలో సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ. 50 కోట్లు ఖర్చవుతుందని, అంత మొత్తం పెట్టుకోగలరా ? అంటూ తనను అడిగినట్లు బొమ్మిరెడ్డి చెబుతున్నారు. అంత మొత్తం ఆనం రామనాయాణరెడ్డి అయితే పెట్టుకోగలరు అని తనతో చెప్పినపుడే అర్ధమైపోయిందన్నారు.
నియోజకవర్గ సమన్వయకర్తగా కేవలం డబ్బును చూసే ఆనంను జగన్ నియమించినట్లు బొమ్మిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక విధంగా బొమ్మిరెడ్డి ఆరోపణల్లో నిజమే అయినా మరి రేపటి ఎన్నికల్లో ఆనం పెట్టుకుంటానన్న ఖర్చును తాను కూడా పెట్టుకోగలనని బొమ్మిరెడ్డి ఎందుకు చెప్పలేదు ? బొమ్మిరెడ్డి అన్నారని కాదుగాని ఒకవైపు వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చైనా పెట్టుకునేందుకు టిడిపి రెడీగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి సమయంలో అధికారంలోకి రావాలనుకుంటున్న వైసిపి కూడా ఆ ఖర్చుకు తగ్గట్లు ప్రిపేర్ కాకపోతే ఎన్నికలను ఎలా తట్టుకుంటుంది ? డబ్బున్న అభ్యర్ధులను రంగంలోకి దింపక ఏం చేస్తారు ?