ప్రభుత్వం ఆరెస్టుల పర్వం మొదలుపెట్టింది మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుతోనే. ఈఎస్ఐ అవినీతి ఆరోపణల కేసులో జైలుకెళ్లిన అచ్చెన్నాయుడు ఇక బయటకురారని వైసీపీ అంటే రెండు రోజుల్లో బయటికొస్తారని, తీసుకొస్తామని టీడీపీ అంది. కానీ 78 రోజుల కస్టడీ తర్వాత ఆయన బయటికొచ్చారు. ఆయన్ను త్వరగా బయటకు తీసుకురావడంలో టీడీపీ విఫలమైందనే అనాలి. ఇదే అచ్చెన్నాయుడుకు, ఆయన కుటుంబానికి నచ్చడం లేదట. చాలా రోజుల నుండి ఈ వార్తలు వస్తూనే ఉండగా తాజాగా అచ్చెన్నాయుడు టీడీపీని వీడనున్నారనే వార్తలు మరింత సంచలనంగా మారాయి. టీడీపీ శ్రేణులు ఈ వార్తలతో షాకవుతున్నారు.
అచ్చెన్నాయుడు బీజేపీ లో చేరే విషయమై ఆలోచిస్తున్నారని, బీజేపీ ఆయనకు గాలం వేసే పనిలో బిజీగా ఉందని కథనాలు వెలివడుతున్నాయి. ఆయనే కాదు ఆయన కుటుంబంలోని ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఇద్దరూ పార్టీని వీడే యోచనలో ఉన్నారని టాక్. కింజరపు ఫ్యామిలీ అంతే తెలుగుదేశం పార్టీకి వీరవిధేయ ఫ్యామిలీ. ఇన్నేళ్ల రాజకీయ ప్రస్తానంలో మరోవైపు చూడలేదు. ఆ అవసరం కూడ వారికి రాలేదు. కానీ ఇప్పుడా పరిస్థితులు వచ్చినట్టు చెబుతున్నారు. అరెస్టయ్యాక అచ్చైన్నకు, ఆయన కుటుంబానికి టీడీపీ హైకమాండ్ అంటే చంద్రబాబు నుండి ఆశించిన సహాయం అందలేదట. అందువల్లనే ఆయన 78 రోజులు కస్టడీలో ఉండాల్సి వచ్చిందని కింజరపు కుటుంబం అలకబూనిందట.
పైగా ఇంకా నాలుగేళ్లు జగన్ అధికారంలోనే ఉంటారు కాబట్టి ఈ నాలుగేళ్లు తమని తాము కాపాడుకోవాలంటే పెద్ద అండ అవసరమని, ఇప్పటికిప్పుడు అలాంటి అండ దొరికేది బీజేపీలోనే అని, బీజేపీ కూడా వస్తామంటే ఘనస్వాగతం పలికి కావలసిన భరోసా ఇస్తుందని అచ్చెన్నాయుడు భావిస్తున్నారట. ఈ విషయం పసిగట్టే చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి అచ్చెన్నాయుడును బుజ్జగించాలని చూస్తున్నారట. అయినా అచ్చెన్న మీమాంసంలోనే ఉన్నారని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం ఇవన్నీ అసత్య కథనాలేనని, అచ్చెన్నాయుడు పార్టీని వీడే ప్రసక్తే లేదని వాదిస్తున్నారు. ఒకవేళ ఊహాగానాలే నిజమై అచ్చెన్నాయుడు, ఆయన కుటుంబం పార్టీని వీడితే చంద్రబాబు గుండె గిలగిలా కొట్టేసుకోవడం ఖాయం.