ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలోగా తెలుగుదేశంపార్టీకి చెందిన కనీసం 30 ఎంఎల్ఏలు పార్టీకి రాజీనామా చేయటానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం. వీరు కాకుండా మరో నలుగురు ఎంపిల పేర్లు కూడా వినబడుతున్నాయనుకోండి అది వేరే సంగతి. ఎంఎల్ఏల లెక్క చెప్పింది మరెవరో కాదు. స్వయంగా పార్టీ ఎంఎల్సీ బుద్దా వెంకన్నే. మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో పనితీరుపై సర్వే ఫీడ్ బ్యాక్ బాగా లేదని రిపోర్టులు వచ్చిన వారు, మళ్ళీ గెలవమని అనుమానం ఉన్న 30 మంది ఎంఎల్ఏలే పక్క చూపులు చూస్తున్నట్లుగా బుద్ధా చెప్పారు. ఎప్పుడైతే బుద్ధా 30 మంది ఎంఎల్ఏలని సంఖ్య చెప్పారో అప్పటి నుండి పార్టీలో అలజడి పెరిగిపోయింది.
ముగ్గురు ఎంఎల్ఏలు, ఒక ఎంపి పార్టీని వీడితేనే చంద్రబాబునాయుడుకు కంటిమీద కునుకు కరువైంది. ముందుగా బయటకు వచ్చేసిన రావెల కిషోర్ బాబు, మేడా మల్లి కార్జున రెడ్డి చంద్రబాబుకు వ్యతరేకంగా పెద్దగా ఏమీ మాట్లాడలేదు. అయితే తర్వాత వచ్చేసిన ఆమంచి కృష్ణమోహన్, అనాకపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ మాత్రం చంద్రబాబును చెడుగుడు ఆడేసుకున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, కులాల కంపు, ఎంఎల్ఏల అవినీతి గురించి ప్రధానమంత్రి స్వయంగా నిర్ధారణ చేసుకోవటం లాంటి ఆరోపణలు చేయటంతో చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.
పార్టీని వీడుతున్న ప్రజా ప్రతినిధులపై తాను అక్కసు వెళ్ళగక్కటమే కాకుండా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అండ్ కో తో కూడా మీడియా సమావేశాలు పెట్టించి మరీ తిట్టిస్తున్నారు. మీడియా సమావేశాల్లో బుద్ధా వెంకన్న ఏదో చెప్పబోయి అసలు విషయం చెప్పేసినట్లున్నారు. అందుకే 30 మంది ఎంఎల్ఏలు పార్టీని వీడబోతున్నారన్న అర్ధం వచ్చేట్లు చెప్పారు. సంఖ్య కూడా పెద్దదిగా ఉండటంతో టిడిపిలో కలకలం రేగింది. ముగ్గురు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళితేనే తట్టుకోలేకుండా ఉన్న చంద్రబాబు నిజంగానే 30 మంది వీడితే తట్టుకోగలరా ?