టిడిపి అభ్యర్ధులపై నిఘా ? పార్టీలో కలకలం

ఇపుడీ అంశమే పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కొందరు అభ్యర్ధులు పక్క చూపులు చూస్తున్నారనే విషయం బాగా ప్రచారం జరుగుతోంది. ఫలితాలు రావటానికి ఇంకా 17 రోజులుంది. ఈలోగా తమ గెలుపు ఖాయమని, టిడిపి ఓటమి తప్పదని కొందరు అభ్యర్ధులు గట్టిగా ఫిక్స్ అయ్యారట. అందుకనే అలా పక్క చూపులు చూస్తున్న అభ్యర్ధులపై నిఘా ఉంచినట్లు కలకలం రేపుతోంది.

టెలికాన్ఫరెన్సుల్లోను, సమీక్షల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి అభ్యర్ధులతో వైసిపి నేతలు టచ్ లో ఉంటున్నారంటూ మండిపోతున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదొకటైతే చంద్రబాబు రివర్సులో ఆరోపిస్తున్నట్లు వైసిపి నేతలు మండిపోతున్నారు.

విషయం ఏదైనా టిడిపి ఓటమి ఖాయమని చాలామంది టిడిపి నేతలే ఫిక్స్ అయిపోయారు. దాంతో తమకు ఇబ్బందులు రాకుండా ముందుగానే జగన్ తో టచ్ లోకి వెళ్ళేందుకు టిడిపి అభ్యర్ధులే ప్రయత్నిస్తున్నారట. రాయలసీమ జిల్లాలు, ఉత్తరాంధ్రకు చెందిన పలువురు అభ్యర్ధుల పేర్లు ప్రచారంలో నలుగుతున్నాయి.

గెలుపు ఖాయమనుకున్న టిడిపి అభ్యర్ధులపై నిఘా పెట్టినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.  ఒకపుడు ఇదే చంద్రబాబు ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహించారు. అదే ఇపుడు రివర్సులో  చంద్రబాబు మెడకు చుట్టుకుంటోంది. ఎలాగైనా సరే తమ అభ్యర్ధులను కాపాడుకునేందుకు వారి కదలికలపై నిఘా ఉంచటం మినహా మరే గత్యతరం లేదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజంగానే ఎంఎల్ఏలు పార్టీ మారదలుచుకుంటే ఇటువంటి నిఘాలు అడ్డుకుంటాయా ?