బ్రేకింగ్ న్యూస్: ప్రత్యక్ష రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్త, మల్లాది విష్ణుకి పోటీ

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కొత్త పార్టీ జనసేనలోకి చేరికలు మొదలయ్యాయి. ఇప్పటికే టిడిపి, వైసిపి పార్టీల నుండి పలువురు నేతలు జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంగబలం, ఆర్ధిక బలం ఉన్న నేతలకే టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో బడా పారిశ్రామికవేత్త జనసేనలో చేరనున్నారని సమాచారం.

పారిశ్రామికవేత్త కోగంటి సత్యం ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారు. ఆయన త్వరలో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాదు జనసేన పార్టీ ఆఫీసులో పార్టీ పెద్దలను కలిశారు. పార్టీలో చేరికపై చర్చలు జరిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నట్టు పార్టీ పెద్దలతో తెలిపినట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీటుకోసం పలువురు జనసేన నేతలు అర్జీలు పెట్టుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.

జనసేన, వామపక్షాల మైత్రి కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీల పెద్దల ముందు విజయవాడ పశ్చిమ, సెంట్రల్ సీట్లు తమకు కేటాయించాలని కొందరు విన్నవించుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేటగిరీలోకి కొనగంటి సత్యం కూడా చేరారు. దీంతో సెంట్రల్ సీటుపై జనసేనలో కూడా అంతర్గతంగా రగడ జరుగుతున్నట్టు సమాచారం. కోగంటి మాత్రం సెంట్రల్ సీటుపై గట్టిగా పట్టుబట్టినట్లు టాక్. విజయవాడ సెంట్రల్ నుండి తప్ప మరొక చోట నుండి పోటీ చేయను అని తేల్చి చెప్పేశారట. సెంట్రల్ సీటుపై జనసేన పెద్దల నుండి పూర్తి స్పష్టత వస్తే జనసేనలో చేరడం ఖాయమని సత్యం అనుచరగణం తెలుపుతున్నారు.

ఇటు వైసిపి తరపున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి ఇప్పటికే మల్లాది విష్ణుకి టికెట్ ఫిక్స్ చేశారు వైసిపి అధినేత జగన్. ఈ విషయంలో వంగవీటి రాధా వర్గం నుండి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయినప్పటికీ జగన్ తన నిర్ణయాన్ని విరమించుకోలేదు. ఈ విషయంపై తెలుగు రాజకీయాల్లో వాడి వేడి చర్చ నడిచింది. కాగా ఇప్పుడు జనసేన సెంట్రల్ సీటు కోగంటికి ఇస్తే మల్లాది విష్ణుకి గట్టి పోటీ ఇవ్వగలరా లేదా అనే అంశంపై జనసేనలో చర్చలు సాగుతున్నాయి. కోగంటి సత్యం విజయబాలాలు ఏమిటి అనే లెక్కలు బేరీజు వేసుకునే పనిలో జనసేన పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది.