(కోెపల్లె ఫణికుమార్)
ప్రముఖ మీడియా సంస్ధలు వెల్లడించిన సర్వే ఫలితాలతో వైసిపి నేతల్లో తాజాగా ఫుల్లు జోష్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలని అనుకుంటున్నారు అనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సర్వేనే నిర్వహించింది మీడియా సిండికేట్. ఈనెల 8-12 తేదీల మధ్య ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సంయుక్తగా నిర్వహించన సర్వే ఫలితాలు ఆజ్ తక్ టివిలో ప్రసారమయ్యాయి. అప్పటి నుండి వైసిపి నేతల్లో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చూడాలని 43 శాతం మంది ప్రజలు అనుకున్నట్లు సర్వేలో వెల్లడైంది. చంద్రబాబునాయుడుకు మద్దతుగా 38 శాతం మంది, పవన్ కల్యాణ్ కు అనుకూలంగా 5 శాతం మంది మొగ్గుచూపారు. సర్వేలో టచ్ చేసిన వివిధ అంశాలపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ఆ విషయం జగన్ మొదలుపెట్టిన పాదయాత్రలో స్పందిస్తున్న జనాలను బట్టే అందరికీ అర్ధమైంది. కాకపోతే ఈ స్పందన, సర్వే నివేదికలు రేపటి ఎన్నికల్లో ఎంత వరకూ ఓట్ల రూపంలో వాస్తవాలవుతాయో వేచి చూడాల్సిందే.
అదే సమయంలో సర్వేలను నమ్ముకుని వైసిపి నేతలు ఏమరుపాటుగా ఉంటే మాత్రం పోయిన ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయనటంలో సందేహమే లేదు. నిజానికి జగన్ స్ధాయిలో కష్టపడుతున్న నేతలు వైసిపిలో చాలా తక్కువమంది మాత్రమే కనబడుతున్నారు. జగన్ చేస్తున్న పాదయాత్రే తమను గెలిపిస్తుందన్న భావన ఎక్కువ మంది నేతల్లో కనబడుతోంది. పోయిన ఎన్నికల్లో ఇటువంటి భ్రమల్లో ఉండటం వల్లే చేతికందిన కూడు నోటికి దక్కకుండా పోయిన చందమైంది. ఇదే విషయాన్ని జగన్ కూడా మొన్న విశాఖ నగరంలో జరిగిన కీలక నేతల సమావేశంలో పదే పదే గుర్తు చేశారు.
చంద్రబాబు పాలనపై జనాల్లో వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పై ఇప్పటికి కొన్ని వర్గాల్లో అభిమానం ఉన్న విషయాన్ని కూడా కాదనలేం. తాజా సర్వేలో జగన్ కు 43 శాతం మంది జనాల మద్దతు కనబడుతోందంటే అందుకు చంద్రబాబు మీద వ్యతిరేకతే కారణం. అయితే, తనపై జనాల్లో ఉన్న వ్యతినేతను చంద్రబాబు పాజిటివ్ గా మలుచుకుంటే జగన్ కు కష్టమే. కాబట్టే జగన్ పాజిటివ్ ఓటు కోసం వైసిపి నేతలందరూ కష్టపడాల్సిందే. కేవలం చంద్రబాబు నెగిటివ్ అంశాలు మాత్రమే జగన్ ను సిఎం కుర్చీలో కూర్చోబెట్టవన్న విషయాన్ని నేతలందరూ గ్రహించాలి. జగన్ పడుతున్న కష్టంలో కనీస సగమైన నియోజకవర్గాల్లో నేతలందరూ సమిష్టిగా కష్టపడితేనే లక్ష్యాన్ని చేరుకుంటారన్న విషయాన్ని మరచిపోకూడదు.