మస్ట్ రీడ్: పొత్తుల విషయంలో ఆలస్యం చేస్తే నష్టం ఎవరికంటే…!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తుల రాజకీయంపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ – టీడీపీ – జనసేన అని.. బీజేపీ – జనసేన మాత్రమే అని.. లేదు లేదు.. టీడీపీ – జనసేన మాత్రమే అని ఇలా రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. అయితే చర్చల వ్యవహారం తొందర్లో కొలిక్కిరానిపక్షంలో ఈ మూడింటిలో ఏ పార్టీకి నష్టం అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.

ఏపీలో ఇప్పుడు పొత్తులపై మూడు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వొద్దు అంటూ జనసేన అధినేత పవన్ తెరపైకి తెచ్చిన ప్రతిపాదన (టీడీపీ – బీజేపీ – జనసేన) ఒకటి కాగా… ఇప్పటికే పొత్తులో ఉన్నాము ఆల్ మోస్ట్ అదే (బీజేపీ – జనసేన) ఫైనల్ అవ్వొచ్చంటూ బీజేపీలో ఒకవర్గం చెబుతున్న అంశం మరొకటి కాగా… కొంతమంది టీడీపీ సీనియర్లు కోరుకుంటున్న (టీడీపీ – జనసేన) పొత్తు అంశం మరొకటి.

అయితే తాజాగా పవన్ మరో విషయాన్ని తెరపైకి తెచ్చారు. అదేమిటంటే… తాను ఒంటరిగా పోటీచెయ్యొచ్చు అన్నట్లు! అది జరగడం ఎంత వరకూ సాధ్యం అనే సంగతి కాసేపు పక్కనపెడితే… టీడీపీ – బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లాల్సి రావొచ్చు. లేదంటే… ఈ మూడు పార్టీలూ విడి విడిగా ఎన్నికలకు వెళ్లొచ్చు. మరి.. ఇన్ని ముడులతో సంక్షిష్టంగా ఉన్న పొత్తు పంచాయతీలో… స్పష్టత ఆలస్యం అయ్యే కొద్దీ సమస్య టీడీపీకే అనేది ఇప్పుడు అసలు విషయం.

ఏపీలో కాస్త అటు ఇటుగా 175 స్థానాల్లోనూ టీడీపీకి అభ్యర్థులు ఉన్నారు. సరే వారు ఎవరు ఫైనల్ అవుతారనే విషయం ప్రస్తుతానికి తేలకపోయినా… అభ్యర్థులైతే రెడీగా ఉన్నారు. కొన్ని చోట్ల ఒకరికి ఇద్దరు ఉన్నారు. జనసేనకు ఈ విషయంలో ఫుల్ ఫ్రీడం ఉంది. జనసేనలో అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుంచి పోటీచేస్తారనే విషయంపైనే ఇప్పటికీ స్పష్టత లేదు కాబట్టి… పొత్తుల విషయంలో స్పష్టత ఎంత ఆలస్యం అయినా వారికి వచ్చిన నష్టం లేదు!

అయితే బీజేపీలో అక్కడక్కడ కొంతమంది సీనియర్లు ఉన్నారు కాబట్టి వారి టిక్కెట్ల విషయంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే… బీజేపీ కూడా కాస్త తొందర పడాల్సిన పరిస్థితి అయితే ఉంది.

సో… చంద్రబాబు పొత్తులపై నాన్ చుడు ధోరణి పక్కనపెట్టి వీలైనంత తొందరగా ఈ విషయంలో స్పష్టత తెచ్చి.. పొత్తుల కారణంగా త్యాగం చేయాల్సిన అభ్యర్థులను చక్కబెట్టి.. ఎన్నికలకు సన్నద్ధం అయితే కొంతవరకూ మేలు జరిగే ఛాన్స్ ఉంది. అలాకానిపక్షంలో… టీడీపీకి మొదటికే మోసం వచ్చే ప్రమాధం లేకపోలేదు!!