తెలంగాణ ఎన్నికల పై ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణ ఎన్నికల్లో డబ్బు విపరీతంగా పంచుతున్నారని తెలంగాణ వచ్చాక రాష్ట్రం మారుతుందనుకుంటే అంతా వట్టిదే అన్నారు. ఇంతకీ మురళీ ఏమన్నారంటే
తమ బంధువు ఇంట్లో మూడు ఓట్లు ఉంటే వాళ్లకు ఓ రాజకీయ పార్టీ నాయకులు రూ. 15 వేల రూపాయలు ఇచ్చారు. దీని ప్రకారం చూస్తే సరాసరి ఒక్కో ఓటు పై పది వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అద్భుతంగా ఉంటదనుకుంటే అంతా వట్టిదే అయ్యింది అని ఆకునూరి మురళి అన్నారు.
ఓ ఐఏఎస్ అధికారి ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆకునూరి మురళీ పురావస్తు శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మురళీ వ్యాఖ్యల పై రాజకీయ నేతలెవరూ కూడా స్పందించలేదు. ఖచ్చితంగా ఇది టిఆర్ఎస్ నేతల పనేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కొద్ది రోజుల క్రితమే ఓ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ లు అంతా కూడా సమావేశమయ్యి పోస్టుల కేటాయింపులో తమకు జరుగుతున్న అన్యాయం పై వారు చర్చించారు. ప్రభుత్వ తీరును కూడా ప్రశ్నించారు. ఈ సమావేశంలో మురళీనే కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో దళిత, సామాజిక తరగతుల వారికి అన్యాయం జరుగుతుందన్నారు. కేవలం కొంత మందికి మాత్రమే కీలక స్థానాలు ఇచ్చి సెక్రటేరియట్ లో చక్రం తిప్పుతున్నారన్నారు. కొంత మందికి ఏళ్ల తరబడి ప్రాధాన్యత లేని పోస్టులు కేటాయించి అవమాన పరిచారని ఆయన విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఆకునూరి మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. టిఆర్ఎస్ పార్టీ నాయకులే ఓటుకు పది వేల రూపాయలు ఇస్తున్నారని తెలంగాణలో ఓట్లను కొనుకుంటున్నారని వారు మండిపడ్డారు. ఎన్నికల సంఘం మురళీ వ్యాఖ్యల ఆధారంగా విచారణ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక ఐఏఎస్ అధికారి విషయాన్ని తెలిపాడంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుందన్నారు. ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి విచారణ చేయాలన్నారు.