అమర జవాను కుటుంబాన్ని దత్తత తీసుకుంటానన్న మహిళా కలెక్టర్

పుల్వామా ఉగ్రదాడిలో 42 మంది జవాన్లు అమరులయ్యారు. అమర జవాన్ల కుటుంబాల గాథ ఒక్కొకరిది ఒక్కోలా ఉంది. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఓ మహిళా కలెక్టర్ అమరు జవాను కుటుంబాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది.

పుల్వామా ఉగ్రదాడిలో బీహార్ కు చెందిన సంజయ్ కుమార్ సిన్హా, రతన్ కుమార్ ఠాకూర్ వీర మరణం పొందారు. ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని షేకుపురా జిల్లా కలెక్టర్ ఇనాయత్ ఖాన్ అన్నారు. తమ జిల్లాలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి మార్చి 10 వ తేది వరకు విరాళాలు సేకరిస్తున్నామన్నారు.

 ఈ రెండు కుటుంబాల్లో ఒక కుటుంబాన్ని ఆమె దత్తత తీసుకుంటామన్నారు. విరాళాల రూపంలో వచ్చిన డబ్బును రెండు కుటుంబాలకు సమానంగా ఇస్తామన్నారు. కలెక్టర్ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు.

ఇనాయత్  ఖాన్ జన్మస్థలం ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా. అక్కడే ఆమె 2007లో ఎలెక్ట్రానిక్స్ లో బిటెక్ చేశారు. తర్వాత ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశారు. అయితే, ఈ ఉద్యోగం ఆమెకు సంతృప్తినీయలేదు. దానికి రాజీనామా చేసి సివిల్స్ రాసేందుకు ఢిల్లీ పయనమయ్యారు. ఢిల్లీ యూనివర్శటీ సమీపంలో గది అద్దెకు తీసుకుని కోచింగ్ తీసుకుంటూ సివిల్స్ రాశారు. 2009 లో ఆమె తొలి ప్రయత్నంలోనే మెయిన్స్ దాకా వెళ్లినా ఇంటర్య్వూలో ఫెయిలయ్యారు. 2010లో ఆమెకు గ్రామీణ బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది. అయితే, అందులో చేరలేదు. మళ్లీ కోచింగ్ కు ఢిల్లీ వచ్చారు. 2011లో మరొక సారి పరీక్ష రాశారు. ఈ సారి సివిల్ కొట్టేశారు. ఆమెను బీహార్ రాష్ట్రానికి కేటాయించారు.

 ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఆమె ఆదర్శవంతంగా పనిచేస్తూ ప్రశంసలందుకుంటున్నారు. ఇపుడామె ఒక అమర జవాన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.