సరిపోయింది సంబరం.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టి తీరతానంటున్నారు.. ఎవరూ ఆయన్ని ఆపలేరట.! ఎవరూ కాదు, ఎవడూ.! అలాగే ఆయన సెలవిచ్చారాయె.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘వారాహి యాత్ర’ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తొలిరోజు బహిరంగ సభలోనే, జనసేనాని మాటల తూటాలు పేల్చారు. ఆయన ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ‘నేను అసెంబ్లీలో అడుగు పెడతాను’ అన్నారు.
అసెంబ్లీ గేటు కూడా తాకలేకపోయారు. ‘అప్పట్లో లెక్కలు వేరు. ఇప్పుడు వ్యూహాలు వేరు’ అంటున్నారాయన. ఆయన వ్యూహాలేంటో ఆయనకైనా తెలుసో లేదో.! ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలో తొలుత నిర్ణయించుకుంటే, ఆ నియోజకవర్గ ప్రజలతో మమేకం అయితే, ఆ నియోజకవర్గ ప్రజలు ఆయన్ని అసెంబ్లీకి పంపాలో వద్దో నిర్ణయించుకుంటారు.
ఎవడో పవన్ కళ్యాణ్‌ని అసెంబ్లీలోకి వెళ్ళకుండా ఎందుకు ఆపుతాడు.? ముందైతే ఈ తరహా ప్రకటనలు, ప్రసంగాలు కట్టిపెట్టాల్సిన అవసరం పవన్ కళ్యాణ్‌కి ఎంతైనా వుంది. వేలాదిగా జనం వస్తారు పవన్ కళ్యాణ్ కోసం. అది ఆయన సినీ గ్లామర్ ప్రభావం.
అలా వచ్చిన వాళ్ళకి ‘నాయకుడిగా’ ఆయన కనిపించేదెప్పుడో ఏమో.!