ఆ రోజులు పోయాయి.. దిగజారొద్దు పవన్!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఇంతకాలం పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలు ఎదుర్కొన్న ఆయన ప్రస్తుతం జనాల్లో తిరుగుతున్నారు. గోదావరి జిల్లాల వేదికగా ప్రచారాన్ని వేగవంతం చేశారు. వరుసగా పదిరోజుల పాటు రెండు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తాజాగా కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా కాకినాడలో జనసేన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడిన పవన్… తనకు ప్రాణహాని ఉందని, సుపారీ గ్యాంగులను దించారనే సమాచారం తనదగ్గర ఉందని వ్యాఖ్యానించారు. జనసేన నాయకులతోపాటు కార్యకర్తలు, వీర మహిళలు కచ్చితంగా భద్రతా నియమాలు పాటించాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు జనసేన కేడర్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ విషయాలపై గతాన్ని గుర్తుచేస్తూ.. పవన్ కు కొన్ని సూచనలు చేస్తున్నారు పరిశీలకులు.

గ‌త సార్వత్రిక ఎన్నిక‌లకు ముందు త‌న‌కు లోకేశ్‌, చంద్రబాబు నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు! తన ప‌ర్యట‌న‌లో రాత్రి వేళ క‌రెంట్ తీసి, తన హ‌త్యకు లోకేశ్ నేతృత్వంలో కుట్ర చేశార‌ని, త్వర‌లో బండారం బ‌య‌ట పెడ‌తాన‌ని ప‌వ‌న్‌ క‌ల్యాణ్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలే చేశారు. అయితే ఈ కామెంట్లపై స్పందించిన చంద్రబాబు.. నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రైంది కాద‌ని, హ‌త్యకు ప్లాన్ చేయాల్సిన అవ‌స‌రం టీడీపీకి లేద‌ని తేల్చి చెప్పారు!

అయితే తాజాగా మరోసారి పవన్ ఇలా తన హత్యకు కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా.. ఎవరు అధికారంలో ఉంటే వారు తనను హత్య చేయాలని భావిస్తున్నారని చెప్పడం వల్ల పవన్ ఏమి ఆశిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తాను ఆరోపించినట్లుగా గతంలో చంద్రబాబు – లోకేష్ లు తన హత్యకు ప్రయత్నాలు చేసి ఉంటే, తాను చెప్పినట్లు అందుకు తన వద్ద ఆధారలు ఉండి ఉంటే… ఇప్పుడు వారితో లుంగేసుకుని ఎందుకు తిరుగుతున్నారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉంది.

అది అప్పుడు రాజకీయాల్లో సానుభూతి ఓట్ల కోసం చేశాను అని ఒప్పుకుంటే.. ఇప్పుడు కూడ జగన్ పై చేసిన ఆరోపణలు కూడా అలాంటివే అవుతాయని జనం భావించాల్సి వస్తుంది. ఫలితంగా ఉన్న గౌరవం కూడా పోతుంది. అలా కాకుండా… గతంలో తన హత్యకు చంద్రబాబు కుట్ర చేసింది నిజమే అయినా.. ప్రజల కోసం ప్రాణాలకు తెగించి పొత్తు పెట్టుకుంటున్నానని అయినా చెప్పాల్సి ఉంటుంది. అలా చెబితే ఇప్పుడు జగన్ పై చేసిన ఆరోపణల్లో కూడా ఎంతో కొంత నిజం ఉండి ఉండొచ్చని జనం భావించే ఛాన్స్ ఉంది!

అలా కాకుండా… ఎన్నికలు సమీపిస్తున్న ప్రతీ సారీ కులాన్నో, మతాన్నో నమ్ముకున్నట్లుగా… ఇలా హత్యకు కుట్ర వంటి సానుభూతి మాటల వల్ల ప్రయోజనం ఉండదని పవన్ కు సూచిస్తున్నారు పరిశీలకులు. పైగా అలాంటి సెంటిమెంట్ డైలాగులు వినే రోజుల్లో ప్రజలూ లేరు, ప్రస్తుత రాజకీయాలూ లేవనే విషయం పవన్ గ్రహించని పక్షంలో… అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అనే ట్యాగ్ లైన్ ని తగిలించుకున్నవారవుతారని సూచిస్తున్నారు.

మరి పవన్ ఇప్పటికైనా ఇలాంటి మాటలు మానేస్తారా.. సపోజ్ నిజంగా ఆ మేరకు తన వద్ద సమాచారం ఉంటే.. తమతో ఎంతో అనుబంధం ఉండి ప్రస్తుతం సెంట్రల్ హోం మినిస్టర్ గా ఉన్న అమిత్ షాకు ఫిర్యాదు చేసి.. తన ఆరోపణల్లో ఉన్న వాస్తవాలను నిరూపించుకుంటారా అన్నది వేచి చూడాలి. ఇదే సమయంలో గతంలో తనను హత్య చేయించడానికి లోకేష్ ప్రయత్నించినట్లు తన వద్ద ఉన్న ఆధారాలను సైతం కేంద్రం హోం మంత్రిత్వ శాఖకు ఇవ్వాలి. అలాంటి చర్యలు చేపట్టన్నంతవరకూ… ఇవన్నీ దిగజారిన రాజకీయ ఎత్తుగడలు అని జనం నమ్మే ప్రమాదం లేకపోలేదు!!