భార్య పై అనుమానంతో భర్త ఏం చేశాడంటే

వనస్థలిపురంలో దారుణం జరిగింది. భార్య పై అనుమానంతో భర్త సైకోగా మారాడు. ఆమె పై కత్తితో దాడి చేసి అతను కూడా కత్తితో పొడుచుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కొండారం గ్రామానికి చెందిన మారెడ్డి కృష్ణారెడ్డి, పద్మజ దంపతులు. వీరు ఆరు సంవత్సరాల క్రితం  హైదరాబాద్ వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. పద్మజ టైలర్ పని చేస్తుంది. కృష్ణారెడ్డి ఎలాంటి పని లేకుండా ఉండేవాడు. భార్య పై అనుమానంతో అతను నిత్యం ఆమెను వేధించేవాడు. 

దీంతో గొడవలు జరగడంతో రెండు సంవత్సరాల నుంచి కృష్ణారెడ్డి భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. సోమవారం సాయంత్రం భార్య గుడికి వెళ్లిన టైంలో ఇంటికి వచ్చాడు. ఆమె రాగానే ఆమెతో గొడవపడి కత్తితో దాడి చేశాడు. అనంతరం అతను కూడా కడుపులో పొడుచుకున్నాడు. దీంతో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.