రాయలసీమలో మరో లక్ష ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మూడు రిజర్వాయర్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి వర్చువల్ విధానం ద్వారా సీఎం జగన్ భూమిపూజ చేశారు. ఈ ప్రాజెక్టుకు వైఎస్సార్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుగా నామకరణం చేశారు.
చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ ను సీఎం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మాలగుండ్ల శంకరనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య పాల్గొన్నారు. జిల్లాలో తీవ్రకరవులో ఉండే రాప్తాడు నియోజకవర్గానికి ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న అప్పర్ పెన్నార్ డ్యామ్ కు టీడీపీ ప్రభుత్వం రూ.810 కోట్లు మంజూరు చేసింది. అయితే, అప్పటి నుంచి పనులు ప్రారంభంకాలేదు.
దీనిపై దృష్టిపెట్టిన సీఎం జగన్, అప్పర్ పెన్నార్ మ్ కు కృష్ణా జలాలను అందించేలా ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా పేరూరు డ్యాంకు నీరు మళ్లించేలా రూ.264.54 కోట్లతో 53.45 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేపట్టారు. దీని ద్వారా పేరూరు డ్యాం దిగువన ఉన్న 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. డ్యాంకు సమీపంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో భూగర్భజలాలూ పెరిగి పరోక్షంగా మరో 25 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.