గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు మొదలయ్యాయి. జగన్ హత్యాయత్నానికి సంబంధించి ప్రభుత్వం నియమించిన సిట్ పనితీరుపై ఇఫ్పటికే జనాల్లో ఓ అభిప్రాయం ఏర్పడిపోయింది. విశాఖపట్నం విమానాశ్రయంలో పోయిన నెల 25వ తేదీన జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.
జగన్ పై దాడి జరిగిందని మాత్రమే మొదట్లో వైసిపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఘటన జరిగిన అర్ధగంటలోనే డిజిపి ఠాకూర్ దాడి చేసింది జగన్ అభిమానే అని, జగన్ కు సానుభూతి రావటం కోసమే దాడి చేసుండచ్చని విచారణ జరక్కుండానే తీర్పు చెప్పేశారు. దాంతో వైసిపి నేతలకు ఒళ్ళు మండిపోయి ఎదరుదాడి మొదలుపెట్టారు.
సరే జరిగిన విషయాలను కప్పిపుచ్చేందుకు అన్నీ ప్రభుత్వాలు చేస్తున్నట్లుగానే చంద్రబాబునాయుడు కూడా సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్) నియమించారు. అప్పటి నుండి విచారణ సందర్భంగా సిట్ అవస్తలు అంతా ఇంతా కాదు. వైసిపి ఏమో అసలు సిట్ విచారణపైనే నమ్మకం లేదు పొమ్మంది. ప్రభుత్వమేమో సిట్ విచారణ ద్వారా జగన్ పై జరిగిన హత్యాయత్నం డ్రామాగా తేల్చేయాలని పట్టుదలతో ఉంది దాంతో ప్రధాన ప్రతిపక్షం-ప్రభుత్వం మధ్య పాపం సిట్ నలిగిపోతోంది. కారణాలేవైనా సిట్ లో అధికారులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. కీలక అధికారైన ఫకీరప్పను ప్రభుత్వం బదిలీ చేసేసింది.
ఇటువంటి పరిస్ధితుల్లో నిందితుడు శ్రీనివాస్ ను వారం పాటు తమ కస్టడీలోనే ఉంచుకుని ఏదో విచారణ చేసేస్తున్నట్లు పెద్ద బిల్డప్పే ఇచ్చారు. చివరకు జ్యుడీషియల్ కస్టడీకి నిందితుడు వెళ్ళిపోవటంతో సిట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తమ వద్ద నిందితుడున్న వారం రోజులు పాపం అధికారులు నానా అవస్తలు పడ్డారు. ఎందుకంటే, ఏదో విచారణ చేసేస్తున్నట్లుండాలి. కానీ ఏ విషయమూ బయటకు పొక్కకూడదు. దాడి చేసిన శ్రీనివాస్ బాగానే ఉన్నాడు. కత్తిపోటు తిన్న జగనూ విశ్రాంతి తీసుకుంటు బాగనే ఉన్నాడు. మధ్యలో సిట్ అధికారులకు చచ్చే చావొచ్చింది.
మొత్తానికి జగన్ హత్యాయత్నం ఘటనలో తేల్చేదేమీ లేదని సిట్ అధికారులతో పాటు జనాలకు కూడా తేలిపోయింది. అందుకనే ఘటన తర్వాత చంద్రబాబుపైన, టిడిపి నేతలపైన వైసిపి నేతలు చేసిన కామెంట్లపై కేసులు పెడుతూ కాలక్షేపం చేస్తోంది ప్రభుత్వం. మాజీ ఎంఎల్ఏ జోగి రమేష్ పై కేసు పెట్టిన ప్రభుత్వం గుంటూరు పోలీస్టేషన్ లో విచారించిన విషయం తెలిసిందే.
విచారణ పేరుతో జోగిని పోలీస్టేషన్లోనే దాదాపు 6 గంటలు అట్టేపెట్టేసుకోవటం ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. అదుపులోకి తీసుకుని విచారించాల్సిన ఎయిర్ పోర్టు క్యాంటిన్ ఓనర్ హర్షవర్దన్ చౌదరిని వదిలేసిన పోలీసులు ఆరోపణలు చేసిన వైసిపి నేతలపై కేసులు పెట్టి అదుపులోకి తీసుకుంటుండటం విచిత్రంగా ఉంది.
ప్రభుత్వ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేతను వదిలేసి ఆరోపణలు చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ పేరుతో కాలక్షేపం చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లే కనబడుతోంది. అయితే ఎంత కాలమని కాలక్షేపం చేయగలదు ?
ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరోవైపు హత్యాయత్నంపై జగన్ అండ్ కో కోర్టులో వేసిన కేసు విచారణకు వచ్చేట్లుంది. చంద్రబాబుపై నాలుగున్నరేళ్ళలో వచ్చిన ఆరోపణలన్నీ ఒకఎత్తు జగన్ పై హత్యాయత్నంలో ఎదుర్కొంటున్న ఆరోపణలు ఒకఎత్తులా తయారయ్యేట్లుంది. మొత్తానికి నిజాలు బయటపడకుండా అధికారపార్టీని సిట్ ఎంతకాలం కాపాడుతుందో చూడాల్సిందే.