ఆంధ్రపదేశ్: జగన్ ప్రభుత్వం న్యాయ రాజధానిగా కర్నూలు… అంటూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ఈ మేరకు చట్టం కూడా చేయడం జరిగింది. అయితే, అసెంబ్లీ చేసిన ఈ చట్టంపై న్యాయస్థానం ‘స్టేటస్ కో’ విధించిన దరిమిలా, వ్యవహారం ప్రస్తుతానికి ‘పాజ్’లో వుంది. ఇంతకీ, కర్నూలు కి హైకోర్టు తరలింపు సంగతేంటి అని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంధించిన ప్రశ్నకు కేంద్రం స్పష్టతనిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు కేంద్రానికి సమాచారం ఇచ్చిందనీ, ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో వుందనీ, హైకోర్టు – రాష్ట్ర ప్రభుత్వం ఓ అవగాహనకు వచ్చాక మాత్రమే ఇది సాధ్యమవుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంధించిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు, రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో వుంది. చంద్రబాబు హయాంలో ఏర్పాటయిన ఈ హైకోర్టు, కర్నూలుకి తరలి వెళ్ళే విషయమై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక చాన్నాళ్ళకు.. అదీ నానా యాగీ తర్వాత, అప్పటి చంద్రబాబు సర్కారుకి మొట్టికాయల పర్వం నడిచాక.. అమరావతిలో ప్రస్తుత హైకోర్టు ఏర్పాటయ్యింది. అయితే, హైకోర్టు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న భవనానికి ‘తాత్కాలికం’ అని పేరు పెట్టింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. సెక్రెటేరియట్, అసెంబ్లీ.. ఇలా అన్నీ తాత్కాలికం పేరుతోనే ఏర్పాటయ్యాయి.
అదే రాష్ట్ర రాజధాని అమరావతికి అతి పెద్ద శాపంగా మారింది. కాగా, హైకోర్టు నిర్వహణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రం తాజాగా పార్లమెంటులో ప్రకటించడం గమనార్హం. అంటే, న్యాయ రాజదాని కోసం కేంద్రం నుంచి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం రాబట్టే అవకాశం దాదాపు లేనట్లే. ఇదే తీరు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలోనూ కేంద్రం నుంచి వినిపిస్తే, ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కూడా అటకెక్కిపోవడం దాదాపు ఖాయమే. ప్రస్తుతానికి వున్న రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి, ఆ తర్వాత మరో రెండు రాజధానుల గురించి ఆలోచన చేస్తే బాగుంటుందన్నది రాజకీయ విశ్లేషకుల సలహా.