21 అసెంబ్లీ స్థానాల్లోనూ జనసేన గెలిచే సీట్లు ఎన్ని?

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఇక అంతా జూన్ 4న రాబోయే ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా… ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు? అనే చర్చ మొదటిదైతే… పవన్ గెలుస్తాడా..? జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి..? అనేది వెంటనే ఎదురవుతున్న ప్రశ్న! ప్రస్తుతం ఏపీలో ఈ స్థాయిలో జనసేన గెలిచె స్థానాలపై ఆసక్తి నెలకొంది.

దీంతో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 21కీ గెలుస్తాదంటూ ఆ పార్టీ నేత నాగబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈసారి అసెంబ్లీలో జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన నొక్కి చెప్పారు. ఇదంతా పవన్ వ్యూహాలు, చంద్రబాబు అనుభవాలు, బీజేపీ సహకారాలతోనే సాధ్యం కాబోతుందని చెప్పుకొచ్చారు! అయితే వాస్తవ పరిస్థితులు అలా లేవని చెబుతూ.. కొన్ని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

అవును… 2014 ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీని స్థాపించిన పవన్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు – మోడీ కూటమికి మద్దతు తెలిపారు. ఆ కూటమి ఇస్తున్న హామీలకు తాను భరోసా అని చెప్పుకొచ్చారు! అనంతరం కూటమి అధికారంలోకి రావడం.. ఏపీకి జరగాల్సిన అన్యాయం జరగడం తెలిసిందే అనే కామెంట్లూ బలంగా వినిపించాయి. కట్ చేస్తే… 2019లో ఒంటరిగా బరిలోకి దిగారు పవన్.

ఈ సమయంలో ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఆయన రెండు చోట్లా ఓడిపోగా.. రాజోలు నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీకి ఒక సీటు వచ్చింది. అనంతర కాలంలో దాన్నీ కాపాడుకోవడంలో పవన్ ఫెయిల్ అవ్వడంతో.. అది కాస్తా పోయింది!! ఇలా ఒంటరి పోరాట ఫలితం రుచి చూసిన పవన్ 2024 సమయానికి మరోసారి మోడీ – చంద్రబాబులతో జతకట్టారు.

ఈ సమయంలో పొత్తులో భాగంగా 21 స్థానాలు దక్కించుకున్నారు. ఇదే క్రమంలో తాను మాత్రం భీమవరం, గాజువాక కాకుండా ఈసారి పిఠాపురంలో పోటీ చేశారు. ఇక అత్యంత రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికల్లో కొందరు విశ్లేషకులు, సిఫాలజిస్టుల అంచనాను చూస్తే.. జనసేన కన్ ఫాం గా గెలిచే స్థానాలు 5 ఉండగా.. 50 – 50 ఛాన్స్ ఉన్న స్థానాలు మరో 6 ఉన్నాయని తెలుస్తుంది. వీటిలో మొదటి 5 ఆల్ మోస్ట్ కన్ ఫాం కాగా.. మిగతా 6 కాస్త అటు ఇటుగా ఉన్నాయని అంటున్నారు.

ఇందులో భాగంగా… పిఠాపురం, అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్, నర్సాపురం స్థానాల్లో జనసేన కచ్చితంగా గెలిచి తీరుతుందని పలువురు విశ్లేషకులు, సిఫాలజిస్టుల అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో… ఎలమంచిలి, పి.గన్నవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తెనాలి స్థానాల్లో 50 – 50 ఛాన్స్ లు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… ఈసారి రాజోలు వైసీపీ ఖాతాలో అని అంటుండటం.

సరే ఫలితాల ముందు ఇలా ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో విశ్లేషణలు తెరపైకి వస్తున్నప్పటికీ… జూన్ 4న వచ్చే ఎగ్జాట్ ఫలితాలే ఫైనల్ అనేది తెలిసిన విషయమే. మరి ఈ అంచనాలను ఎగ్జాట్ ఫలితాలు నిజం చేస్తాయా.. లేదా అనేది వేచి చూడాల్సిందే!